'తూర్పు' రైతులకు రేపు విజయమ్మ పరామర్శ

కాకినాడ, 28 అక్టోబర్ 2013:

తూర్పుగోదావరి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ‌ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ మంగళవారం పర్యటిస్తారు. గడచిన వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలో నష్టపోయిన బాధిత రైతులు, ప్రజలను శ్రీమతి విజయమ్మ పరామర్శిస్తారని పార్టీ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి తెలిపారు.‌ మంగళవారం ఉదయం 7.30 గంటలకు రాజమండ్రిలో ఆమె పర్యటన ప్రారంభం అవుతుందన్నారు. శ్రీమతి విజయమ్మ పర్యటన రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్, రాజానగరం, జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి, రామచంద్రపురం, ముమ్మిడివరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాల మీదుగా సాగి మధ్యాహ్నానికి కాకినాడ సిటీకి చేరుకుంటుంద‌ని చిట్టబ్బాయి వివరించారు.

తరువాత కాకినాడ సిటీ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో శ్రీమతి విజయమ్మ పర్యటించి అన్నవరం చేరుకుంటారన్నారు. శ్రీమతి విజయమ్మ ఆయా నియోజకవర్గాల పరిధిలో పలు గ్రామాల్లో ముంపునకు గురైన వరి, పత్తి తదితర పంటపొలాలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటారు. పలుచోట్ల ముంపు ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శిస్తారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో శ్రీమతి విజయమ్మ పర్యటనలో పాల్గొని విజయవంతం చేయాలని చిట్టబ్బాయి పిలుపునిచ్చారు.

Back to Top