ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోండి

కల్వకుర్తి (మహబూబ్నగ‌ర్ జిల్లా),

29 జూన్‌ 2013: ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు‌ శ్రీమతి వైయస్ విజయమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‌ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పార్టీ పోరాటాలు చేసి, నాయకులుగా ప్రజల్లో నమ్మకం కలిగించుకోవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి మండలం కొట్రలో జరిగిన వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు.‌ తెలంగాణ అమర వీరులకు,‌ మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డిని ప్రాణంగా ప్రేమించి ఆత్మహత్య చేసుకున్న వారికి ముందుగా ఒక నిమిషం మౌనం పాటించి శ్రీమతి విజయమ్మ సంతాపం తెలిపారు.

అనంతరం సదస్సులో మాట్లాడుతూ.. డాక్టర్‌ రాజశేఖరరెడ్డిని ప్రేమించిన, జగన్‌బాబును, షర్మిలమ్మను అక్కున చేర్చుకుని ఆదరించిన ప్రతి హృదయానికి చేతులెత్తి శ్రీమతి విజయమ్మ నమస్కరిస్తున్నానన్నారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులను ప్రత్యక్షంగా కలవడానికి, నాయకులు, కార్యకర్తలతో రాజకీయ వ్యవహారాలు చర్చించడానికి, తమ కుటుంబంపై వచ్చిన ఆరోపణలు, నిందల గురించి మాట్లాడుకోవడానికి, జగన్‌బాబు జైలులో ఎందుకు ఉన్నారని తదితర అన్ని విషయాలూ మీతో పంచుకోవాలని తాను కల్వకుర్తి వచ్చానని అన్నారు. తమ కుటుంబానికి మీరంతా అత్యంత ఆప్తులని మీతో చెప్పాలని వచ్చానన్నారు.

సామాజిక సమీకరణలు, అభ్యర్థుల గుణగణాలు ప్రభావితం చేసే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు ఐకమత్యంగా వ్యవహరించాలని శ్రీమతి విజయమ్మ సూచించారు. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే అందరూ కలిసి కూర్చొని ఐకమత్యంగా పరిష్కరించుకోవాలని, సమన్వయంతో ముందుకు సాగడం ద్వారా పంచాయతీలను కైవసం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఏ ఎన్నికలు వచ్చినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ సర్వ సన్నద్ధంగా ఉందని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు కూడా ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డిగారి ముప్పై నాలుగేళ్ళ రాజకీయ జీవితంలో సుస్థిరమైన ప్రజాప్రస్థానాన్ని కొనసాగించారని శ్రీమతి విజయమ్మ ప్రస్తావించారు. కార్యకర్తలకు ఆయన ఎంతగా విలువ ఇచ్చి, ప్రేమించి, ఆదరించారో అందరికీ తెలిసిందే అన్నారు. అంతే ప్రేమ, అభిమానంతో రాజశేఖరరెడ్డిని ఒక నాయకునిగా ఉన్నత స్థానానికి పార్టీ శ్రేణులు తీసుకువెళ్ళారని ప్రస్తావించారు. కార్యకర్తల కృషి, పట్టుదల, సహకారం వల్లే ఆయన ఆ స్థానంలో ఉండగలిగారని చెప్పారు. ఆనాడు డాక్టర్ రాజశేఖరరెడ్డిను, తరువాత జగన్‌బాబు మీద,‌ ఇప్పుడు షర్మిలమ్మ పట్ల ప్రజలు చూపిస్తున్న ఆదరణ, ప్రేమ, ఆప్యాయతకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. మీ కష్టాలు, బాధలు, సంతోషాల్లో తమ కుటుంబం పార్టీ శ్రేణులకు అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

పార్టీ ఏర్పాటై రెండేళ్ళయిందని, గ్రామాల్లో, పట్టణాల్లో పార్టీని పటిష్టం చేసుకోవడానికి, ఉన్న నాయకత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి, ప్రత్యర్థులకు మన సత్తా చాటేందుకు కూడా ఎన్నికలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ప్రజల్లో ఉన్న ఆదరణ, అనుకూలతను పునాదిగా చేసుకుని మన పార్టీని మరింగ బలీయంగా తీర్చుదిద్దుకోవడానికి కృషి చేయాలని శ్రేణులకు ఆమె దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లోనే కార్యకర్తలు నాయకులుగా ఎదిగేందుకు అవకాశం వస్తుందన్నారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి ఈ ఎన్నికలు వేదికగా ఉపయోగపడతాయని శ్రీమతి విజయమ్మ అన్నారు. రాజశేఖరరెడ్డిగారి ఆశయాలను, జగన్‌బాబు లక్ష్యాలను మనందరం కలిసికట్టుగా సాధిద్దామని పిలుపునిచ్చారు. పార్టీలో వివిధ అంచెల్లో ఉన్న నాయకులు కార్యకర్తలకు చేదోడువాదోడుగా ఉంటారని ఆమె హామీ ఇచ్చారు.

నిజానికి స్థానిక సంస్థలకు ఎన్నికలు రెండేళ్ళ క్రితమే జరగాల్సి ఉందని, ప్రభుత్వం తాత్సారం కారణంగా గ్రామాల్లో సౌకర్యాలు లేకుండా సమస్యలతో సతమతవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక ఎన్నికలు జరిగి ఉంటే ప్రజాప్రతినిధులే ఈ సమస్యలపై అధికారులను నిలదీసి ఉండేవారన్నారు. ప్రజల అవసరాలు, బాగోగుల గురించి ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. పన్నుల మీద పన్నులు వేసి ప్రజలను బాధపెట్టడమే ఈ ప్రభుత్వానికి తెలుసని దుయ్యబట్టారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు అప్పగించడం ముఖ్యమని, రాజశేఖరరెడ్డి వచ్చాకే వాటిని ఇచ్చారని గుర్తుచేశారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్ట్రానికి రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు నిలిచిపోయాయని దుయ్యబట్టారు. కరెంటు కోతలు, బిల్లుల మోత వల్ల గ్రామాలు అంధకారంలో మగ్గిపోతున్నాయని విచారం వ్యక్తంచేశారు. ఈ ప్రభుత్వం తీరు ఎంతమాత్రమూ ప్రజామోదంగా లేదన్నారు.

మహానేత రాజశేఖరరెడ్డి మాత్రమే స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించారని, ఆయనకు ముందు, వెనుక అధికారంలో ఉన్నవారికి ఎన్నికలు నిర్వహించాలన్న చిత్తశుద్ధి లేదని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీలకు ఇవ్వాల్సిన అధికారాలు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించినా రిజర్వేషన్లలో గందరగోళం సృష్టించి వాయిదా వేస్తున్న వైనాన్ని ఆమె ప్రస్తావించారు. 60.5 శాతం రిజర్వేషర్లతో వైయస్‌ఆర్‌ ఎన్నికలు జరిపించారని, మరి ఈ ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేకపోతోందని ప్రశ్నించారు. బి.సి. జనాభా దామాషా తీసుకుని కొన్ని స్థానాలను ఆ కేటగిరీకే కేటాయిద్దామని, వాటిల్లో ఇతరులను కాకుండా కేవలం బీసీలనే పోటీకి పెడదామని జగన్‌బాబు 2011లోనే ప్రతిపాదిస్తే మిగతా పార్టీలు ముందుకు రాలేదని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు.

ఎన్నికల్లో అవినీతికి పాల్పడేందుకు ప్రత్యర్థి పార్టీలు ఎత్తులు వేస్తాయని, వాటిని చిత్తుచేయాలని శ్రీమతి విజయమ్మ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న‌ కాంగ్రెస్, టిడిపిలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీల బెదరింపులకు భయపడకుండా ఎదురు నిలవాలని, ప్రలోభాలకు లోను కావద్దని దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని అన్నారు. స్థానిక ఎన్నికల్లో మంచి అభ్యర్థులను నిలబెట్టుకుని, పార్టీని పునాదుల నుంచీ పటిష్టం చేసుకోవాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో అతి విశ్వాసం, అలసత్వం వద్దని హెచ్చరించారు. మనమంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. ప్రతి పంచాయతీ మీదా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడించాలన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉండే ఓటర్ల పేర్లను జాబితా నుంచి అధికార పక్షం తొలగించేందుకు కుట్ర చేయవచ్చని అందుకే పార్టీ శ్రేణులు ఓటర్ల జాబితాపైన నిఘా పెట్టాలని సూచించారు.

రైతుల కష్టాలు బాగా తెలిసిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని, అందుకు వారికి ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ముందుండేవారని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పిచేందుకు కృషి చేశారన్నారు. అప్పటి గిట్టుబాటు ధరలు ఈ రోజు ఏ పంటకే లేవన్నారు. సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా జలయజ్ఞాన్ని మహానేత వైయస్‌ ప్రారంభించారన్నారు. రాష్ట్రం మొత్తం మీద రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తే.. ఒక్క తెలంగాణ ప్రాంతంలో ఆయన రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశారని గుర్తుచేశారు. తెలంగాణ వాదాన్ని వైయస్‌ గౌరవించారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపించారన్నారు. మహానేత వైయస్‌ చేసిన ఏ పథకమైనా దాదాపు 70 శాతం లబ్ధి తెలంగాణ ప్రాంతానికే జరిగిందన్నారు.

మహబూబ్‌నగర్ జిల్లాపై వై‌యస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేకాభిమానం చూపేవారని‌ శ్రీమతి విజయమ్మ తెలిపారు. రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి వైయస్ఆ‌ర్ అని రైతు పండించిన ధరకు గిట్టుబాటు కల్పించేలా ఆయన కృషిచేశారని తెలిపారు. మహానేత వైయస్‌ హయాంలో పాలమూరు జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని, నాలుగేళ్ళలోనే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలని మూడు భారీ పెండింగ్‌ ప్రాజెక్టులను చేపట్టారన్నారు. రూ. 360 కోట్ల అంచనా వ్యయంతో కోయిల్‌సాగర్‌ ఆధునికీకరణ పనులు ప్రారంభించారన్నారు. దశాబ్దాలుగా రెండు ప్రాంతాల మధ్య రగులుతున్న ఆర్‌డిఎస్‌ సమస్య పరిష్కారానికి వైయస్‌ఆర్ నిపుణుల కమిటీ వే‌శారని గుర్తుచేశారు. ఒక్క పాలమూరు జిల్లాలోనే ప్రాజెక్టులకు ఆయన రూ.7 వేల కోట్లు ఖర్చుచేశారన్నారు.

పాలమూరు జిల్లాను పసిడి జిల్లాగా చూడాలని ఆ మహానేత ఆశపడ్డారన్నారు. వై‌యస్ మరణానంతరం జిల్లాను పట్టించుకునే నాథుడే కర‌వయ్యారని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ ప్రాజెక్టుల శిలిఫలకాలపై కనీసం ఆయన పేరు కూడా లేకుండా కిరణ్‌కుమార్‌రెడ్డి చేశారని విచారం వ్యక్తంచేశారు.
పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్న చంద్రబాబు ఏనాడు దీని అభివృద్ధి పైన గాని,  సమస్యల పరిష్కారం పైన గాని శ్రద్ధ పెట్టలేదని ఆమె విమర్శించారు.
భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను శంకుస్థాపనలకే పరిమితం చేశారని ఆరోపించారు. ఆయన హయాంలో తినడానికి తిండి లేక, పంటలు పండించేందుకు నీళ్ళు, కరెంటు లేక ప్రజలు ఎక్కువగా వలసలు పోయిన జిల్లాగా పాలమూరు రికార్డులకెక్కిందని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు అన్నీ కష్టాలే అని శ్రీమతి విజయమ్మ విమర్శించారు. ప్రజల్లో నుంచి రాని ముఖ్యమంత్రి కిరణ్‌రెడ్డి కనుకే ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మీ ఇంటికి వస్తే ఏమిస్తావ్... మా ఇంటికి వస్తే.. ఏం తెస్తావ్.. అనే తీరులో ఉంది కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరు అని శ్రీమతి విజయమ్మ ఎద్దేవా చేశారు.

జగన్‌బాబు పక్షాన దేవుడున్నాడని, త్వరలోనే బయటికి తీసుకువస్తాడని శ్రీమతి విజయమ్మ విశ్వాసం వ్యక్తంచేశారు. జగన్‌బాబు నేతృత్వంలో త్వరలోనే రాజన్నసువర్ణయుగాన్ని తెచ్చుకుందామని అన్నారు. జగన్‌బాబు ఇచ్చిన హామీలన్నింటినీ శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేశారు.

Back to Top