సిఎంకి ఢిల్లీ ట్రిప్పే ముఖ్యమై పోయింది!


ఏలూరు

5 నవంబర్ 2012 : రాష్ట్రంలో వరద బీభత్సంతో రైతులు ఇంత కష్టంలో ఉంటే సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి 'ఢిల్లీ ట్రిప్పే' ముఖ్యమై పోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. రైతుల కష్టం కంటే వాళ్లకు వాళ్ల పదవులే ముఖ్యమైపోయాయని ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఇంత భారీ యెత్తున నష్టం జరిగినా, ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందనా లేదని ఆమె ఆక్షేపించారు.
"ఐదు లక్షల ఎకరాల పంట ఉంది. లక్షా ఇరవై ఐదు వేల మంది రైతులు ఉన్నారు. మూడు లక్షల ఎకరాలలో పంట దెబ్బతిందని ఇప్పుడు అధికారులు అంచనా వేశారు. మరి ఈ రోజు రైతులు ఇంత కష్టంలో ఇంత బాధల్లో ఉంటే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. నీలం తుఫాను విషయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాకక పోయినా కూడా భార వర్ష సూచన ఉందని చెప్పింది. రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నా ఈ ప్రభుత్వం స్పందించ లేదు. ఇంతదాకా ఎవరూ వచ్చి పలకరించింది లేదు. పట్టించుకుందీ లేదు." అని విజయమ్మ విమర్శించారు.
గతంలో 'తమ్మిలేరు ప్రొటెక్టింగ్ వాల్' కోసం రాజశేఖర్ రెడ్డిగారు రూ. 17 కోట్లివ్వడం జరిగిందనీ, ఎంఎల్ఏ నానీ అభ్యర్థన మేరకు మళ్లీ రూ. 28 మంజూరు చేశారనీ ఆమె గుర్తు చేశారు. కానీ వైయస్ పోయాక ఆ డబ్బు అందలేదనీ, ముఖ్యమంత్రిగారు సమీక్షకు వచ్చినప్పుడు దాంతో కలిపి రూ. 30 కోట్లు ఇస్తామన్నా ఇంతదాకా అతీగతీ లేదనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకటి తుఫాను నష్టపరిహారానికే ఇప్పటిదాకా దిక్కు లేదని ఆమె విమర్శించారు.
సోమవారం విజయమ్మ పలు ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. వరద బాధితులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని విధాలా అండగా
నిలుస్తామని విజయమ్మ ప్రకటించారు. వైయస్ లేకపోవడంతో రైతులు దుస్థితిని ఎదుర్కొంటున్నారని
ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ సిఎం అయితే రైతుల సమస్యలకు శాశ్వతపరిష్కారం
లభిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. రైతులు ధైర్యంగా ఉండాలనీ, త్వరలోనే రాజన్నరాజ్యం వస్తుందనీ ఆమె ధైర్యం చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం నిడమర్రులో నీటమునిగిన పంటలను
పరిశీలించిన విజయమ్మ రైతులతో మాట్లాడారు. పంట నష్టం వివరాలను అడిగి
తెలుసుకున్నారు. కౌలు రైతులతో సహా పంట నష్టపోయిన రైతులందరికీ బీమాతో పాటు నష్టపరిహారం కూడా ఇవ్వాలని విజయమ్మ డిమాండ్ చేశారు. 

Back to Top