నిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపేందుకే పాదయాత్ర

  • మహానేతకు పూలమాల వేసి నివాళులర్పించిన పద్మావతి
  • రైతు, ప్రజా సమస్యలపై పదిరోజుల పాటు 150 కి.మీల మేర యాత్ర
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం: రైతు, ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరుబాట పట్టింది. కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రాంతాలను ఆదుకోవాలనే డిమాండ్‌తో శింగనమల వైయస్‌ఆర్‌ సీపీ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేల్కొలుపు పాదయాత్రను చేపట్టారు. మొదటి శింగనమల నియోజకవర్గంలో దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఏమైనా మేలు చేస్తుందేమోనని మూడేళ్ల నుంచి ఎదురులచూశామన్నారు. కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో విసిగిపోయామన్నారు.  పాదయాత్ర ద్వారా మొద్దునిద్రపోతున్న ప్రభుత్వాన్ని తట్టిలేపుతామన్నారు. ఎల్లనూరు నుంచి గార్లెదిన్నె వరకు సుమారు 150 కిలోమీటర్లు మేర పదిరోజుల పాటు ఈ పాదయాత్ర సాగుతుందన్నారు. పాదయాత్రలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకొని వాటిపై ప్రభుత్వం మీద పోరాడుతామన్నారు. 

రైతుల ఇన్సూరెన్స్‌ డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. రూ. 85 కోట్లు ఇస్తామని చేతులు దులుపుకుంటుందని, అవి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. అనంతరం మాజీ ఎంపీ, పార్టీ సీనియర్‌ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాలో మూడు సంవత్సరాల్లో 267 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే 8 మంది ఆత్మహత్యలు చేసుకోగా.. 4 లక్షల మంది వ్యవసాయ కూలీలు ఉపాధి పనుల కోసం వలసలు వెళ్లారన్నారు. జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ మాట్లాడుతూ.. పద్మావతి మేల్కొలుపు పాదయాత్రతోనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులకు మేలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 
Back to Top