'షర్మిల సవాల్‌కు చేతనైతే బదులివ్వండి'

హైదరాబా‌ద్ : ఖమ్మం జిల్లా బయ్యారంలోరి రక్షణ స్టీల్సుతో తన భర్త బ్రదర్ అని‌ల్‌ కుమార్‌కు సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని శ్రీమతి షర్మిల చేసిన సవాల్‌కు దమ్ముంటే ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు జూపూడి ప్రభాకరరావు, మూలింటి మారెప్ప సవాలు చేశారు. రక్షణ స్టీల్సు బ్రదర్ అని‌ల్‌దే అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన ప్రతిపక్షాలు శ్రీమతి షర్మిల సవాలుపై ఎందుకు నోరు మెదపడం లేదని వారు ప్రశ్నించారు. మాజీ మంత్రి మారెప్ప, జూపూడి మంగళవారం నాడు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంత యువతకు ఉపాధి లభిస్తుందనే సదుద్దేశంతోనే రక్షణ స్టీల్సుకు మహానేత డాక్టర్ వై‌యస్ ప్రభుత్వం అనుమతిచ్చిందని‌ వారు తెలిపారు. జిఓ ఎం.ఎస్ 69/2000ను ప్రతిపక్షాలు పూర్తిగా చదివి మాట్లాడాలని‌ వారు సూచించారు. రక్షణ స్టీల్సుకు లాభాలు వస్తే అందులో 20 శాతం నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి కోసం వెచ్చించాలని‌ మహానేత వైయస్ షరతు విధించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ ఎపిఎండిసికి గనుల తవ్వకం కేటాయింపునూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండడం విడ్డూరం అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియదని, తాము చెప్పే అబద్ధాలనే విశ్వసిస్తారనుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

దళిత బాంధవుడు వైయస్‌ఆర్‌ :
దళితుల సర్వతోముఖాభివృద్ధికి మహానేత డాక్టర్ వై‌యస్‌ఆర్ ఎంతగానో పాటుపడ్డారని, దళితులకు ఆయన చేసినంత మేలు మరే ‌సిఎం చేయలేదని మారెప్ప తెలిపారు. పదవులు, పైరవీల కోసమే కాంగ్రెస్, ‌టిడిపి నేతలు వైయస్‌పై నోరుపారేసుకుంటున్నారని విమర్శించారు. విజన్ 2020 పేరుతో 420 పథకాలు పెట్టి దళితులు, ‌బిసిలను చంద్రబాబు నిండా ముంచారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయలేదు. 3 వేల ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి గురించి పట్టించుకోని ప్రభుత్వం ఆర్భాటాలతో కొత్త పథకాలు ప్రకటిస్తోంది. ప్రభుత్వ ప్రచారమే తప్ప వాటితో దళితులకు ఒరిగిందేమీ లేద’ని విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top