షర్మిల నోట.. జగన్ భరోసా


హైదరాబాద్: అంతటా ఉద్విగ్న భరిత వాతావరణం. ఓ పక్క దట్టమైన మబ్బులూ, మరో పక్క తీక్ష్ణదృక్కులు సారిస్తున్న సూరీడు. వేల సంఖ్యలో అక్కడికి చేరిన ప్రజలు.. ఎవరికోసమో ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపటికి నల్ల రంగు వాహన శ్రేణి ఒకటి అక్కడికి చేరింది. ఒక్కసారిగా వైయస్ఆర్ అమర్ రహే.. అనే నినాదాలు మిన్నంటాయి. మూడేళ్ళ క్రితం కర్నూలు జిల్లాలోని నల్లకాలువ దగ్గర సన్నివేశమిది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్ ఎడమ చేతిని ఊపుతూ అక్కడున్నవారిని పలుకరించారు. 

వైయస్ఆర్ మృతిని జీర్ణించుకోలేక తనువు చాలించిన ఆయన అభిమానుల కుటుంబాలను ఆదుకుంటాననీ, త్వరలో వారి ఇళ్ళకు వచ్చి స్వయంగా పరామర్శిస్తాననీ జగన్ ఆ సభలో మాటిచ్చారు. అందుకు అనుగుణంగా ఆయన ప్రారంభించిన ఓదార్పు యాత్ర.. పాలక, విపక్ష పార్టీల పునాదులను కదిపేసింది. ఆ ప్రభావాన్ని తట్టుకునేందుకు చేసిన కుట్ర కారణంగా జగన్ జైలు పాలయ్యారు. అక్కడితో వారు విశ్రాంతి తీసుకోకుండా ఆయనకు బెయిలు రాకుండా శతధా అడ్డుపడుతున్నారు.

ఈ పరిణామక్రమంలో తాను చేపట్టాలనుకున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బాధ్యతను జగన్ తన సోదరి షర్మిలపై ఉంచారు. బెయిలు లభిస్తే మధ్యలోనే తాను కలవాలని ఆయన భావిస్తున్నారు. అన్న నిర్ణయాన్ని శిరసావహించారు షర్మిల. అక్టోబరు 18వ తేదీన వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయలోని వైయస్ ఘాట్ నుంచి ఆమె పాదయాత్రను ప్రారంభించారు. మరో ప్రజాప్రస్థానానికి లభిస్తున్న ఆదరణ పాలక, ప్రతిపక్షాల గుండెల్లో ఇప్పుడు రైళ్ళు పరుగెత్తిస్తోంది. గాంధీ జయంతి రోజున 'వస్తున్నా.. మీకోసం' పేరిట తెలుగుదేశం పార్టీ అధినేత వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వెనకాలే వస్తున్న వైయస్ జగన్ అభిమాన సంద్రం జగన్నినాదాలతో వస్తోంది. 

నాలుగు రోజుల ప్రజా ప్రస్థానంలో తనను కలిసిన వివిధ వర్గాల ప్రజలతో షర్మిల మమేకమవుతూ వైయస్ జగన్ ఇచ్చిన భరోసాను చేరవేస్తున్నారు. విద్యుత్తు సమస్యలు, మద్యం, ఉపాధి హామీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ , తదితర అంశాలపై వైయస్ జగన్ చెప్పిన అంశాలను మరోసారి చెబుతూ ముందుకు సాగుతున్నారు. పాలకప్రతిపక్షాలపై జగన్ సంధించిన వ్యంగ్య బాణాలనే అందిపుచ్చుకుని.. ప్రయోగిస్తున్నారు.

* నాలుగో రోజు లింగాలలో స్థానికులు మురికి వస్తున్న మంచినీటిని ఓ సీసాలో తెచ్చి చూపించగా... ముఖ్యమంత్రిగారికిచ్చి తాగమని కోరడంటూ షర్మిల చెప్పడం దీనికో ఉదాహరణ.
* జగనన్న సీఎం అయ్యాక చేనేత కార్మికులకు ఇచ్చే పింఛను వెయ్యి రూపాయలవుతుందని ఆమె హామీ ఇచ్చారు. తన తండ్రి డాక్టర్ వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చేనేతలకు రూ. 200 కోట్లు ఇచ్చారనీ, రూ. 312 కోట్ల రుణాల మాఫీకి జీవో జారీ చేసినప్పటికీ ప్రభుత్వం ఇంతవరకూ అమలు చేయలేదన్నారు. జగనన్న సీఎం అయిన తర్వాత చేనేతల వెతలు తీరుతాయన్నారు.
* జగన్ మాదిరిగానే ఆమె ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. మరో ప్రజాప్రస్థానం తొలిరోజునుంచీ పాదయాత్రలో పాల్గొంటున్న వెంకటయ్య అనే వికలాంగుడిని ఆమె ప్రతి దినం పలుకరిస్తున్నారు. 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొలి ప్లీనరీలో జగన్ ఇచ్చిన హామీలను షర్మిల తూచ తప్పకుండా పునరుద్ఘాటిస్తున్నారు. ప్రతి పేదవాడికీ ఇల్లు, ఏటా పది లక్షల ఇళ్ళ నిర్మాణం, రైతుకోసం ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టడం, రైతన్నకు వడ్డీ లేని పంట రుణాలమంజూరు చేస్తామని జగన్ చెప్పారు. 
రైతులకు ఇప్పుడున్న దానికి అదనంగా మరో నలబై లక్షల చదరపు అడుగుల గోదాములు నిర్మిస్తామన్నారు. 
రైతులకు సలహాలు ఇచ్చేందుకు 103 పేరుతో మొబైల్ అగ్రి క్లినిక్‌లను ఏర్పాటు చేస్తామని జగన్ ప్లీనరీలో తెలిపారు. పాడి పశువుల సంరక్షణకు వైద్యులతో కూడిన 102 పథకం ప్రవేశ పెడతానని కూడా చెప్పారు.
వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ. రెండు వందల నుంచి ఏడు వందలకూ, వికలాంగులకు రూ. ఐదు వందల నుంచి వెయ్యికీ పెంచతామనీ, ప్రతి మండలానికీ 104 వాహనం, 108 వాహనాలను 800 నుంచి 1500కు పెంచుతామనీ, కార్పొరేట్ ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూనే ఆస్పత్రులను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటామనీ జగన్ భరోసా ఇచ్చారు. 
వైయస్ఆర్ అమ్మ ఒడి పథకంలో కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందిస్తామనీ, పిల్లలను ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ చదివించడానికి రూ. 500, ఇంటర్లో రూ. 700, డిగ్రీలో వెయ్యి చొప్పున వారి తల్లి బ్యాంకు ఖాతాలో జమచేస్తామనీ జగన్ ప్లీనరీలో ప్రకటించారు.
తెల్ల కార్డులపై నెలనెలా 30కిలోల బియ్యం, భూమిలేని నిరుపేదలకూ, నిరుపేద దళిత కుటుంబాలకు కనీసం ఎకరం భూమిని సాగుయోగ్యం చేసి అందించడం చేస్తానని కూడా ప్లీనరీలో వివరించారు. 
గ్రామాల్లోని ప్రతి స్కూలుకు మౌలిక సౌకర్యాలు కల్పించడం, ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత స్థాయికి పెంచడం, ప్రతి స్కూలులోనూ ఆంగ్ల మాధ్యమాన్ని అందుబాటులోకి తేవడం చేస్తామని జగన్ తెలిపారు.
మహానేత కలను సాకారం చేసేలా కోటి ఎకరాలకు సాగు నీరందించేలా చర్యలు చేపడతామనీ, అందుకు వీలుగా ప్రాధాన్యతాక్రమంలో ప్రతి ప్రాజెక్టునూ నిర్మిస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు మూసివేస్తామనీ జగన్ ప్లీనరీలో హామీ ఇచ్చారు. 
షర్మిల ఈ అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ జగన్‌ చెప్పమన్నారని తన ప్రసంగాలలో పేర్కొంటున్నారు.


Back to Top