ఢిల్లీ టూర్ ఎందుకో చంద్రబాబు వెల్లడించాలి

రావులపాలెం (తూ.గో.జిల్లా),

13 సెప్టెంబర్ 2013: చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో దమ్ముంటే ప్రజలకు వివరించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సవాల్‌ చేశారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోకుండా చంద్రబాబు ఢిల్లీ వెళితే ఏం ప్రయోజనం ఉంటుందని ప్రశ్నించారు. చీకట్లో చిదంబరంను కలిసి కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యేందుకే చంద్రబాబు ఢిల్లీ పర్యటన అని ఆమె ఆరోపించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల శుక్రవారంనాడు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఉద్రేకంగా ప్రసంగించారు.

సమైక్యవాదులను బెదరించిన చంద్రబాబుపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? చంద్రబాబు గారూ. మీ గురించి మీరు అసలేమనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 'చంద్రబాబును చూసి‌ మహానేత డాక్టర్‌ వై‌యస్‌ఆర్ భయపడేవారట.. చంద్రబాబును చూసి ఎవరైనా భయపడటానికి ఆయనకు ఏమైనా అంటు వ్యాధులున్నాయా' అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. మిమ్మల్ని చూస్తే.. జోకర్‌ను చూసినట్లు వైయస్ఆర్ ఎంతగానో నవ్వుకునేవారో మీకు గుర్తు లేదా? చంద్రబాబు గారూ అన్నారు. సాక్షి టివిలో క్లిప్పింగులు వేయించమంటారా? చంద్రబాబు గారూ అన్నారు.

రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నాడని‌ శ్రీమతి షర్మిల అన్నారు. పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని‌ని కట్టుకోవటం సాధ్యమేనా అని ఆమె ప్రశ్నించారు. సమైక్య శంఖారావంలో భాగంగా శ్రీమతి షర్మిల శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో ప్రసంగించారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి కారణం మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డేనని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. లక్షల విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా అందించిన ఘటన వైయస్‌ది అన్నారు. విభజన పేరుతో అన్నదమ్ముల మధ్య అగ్గి పెట్టి కాంగ్రెస్ చలి‌ కాచుకుంటోందని శ్రీమతి షర్మిల మండిపడ్డారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనే ఏకైక లక్ష్యంతో కోట్లాది‌ మంది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేస్తోందని ఆమె ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి 50 శాతానికి పైగా ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుందని, ఎలాంటి పరిష్కారాలు చూపకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. బ్లాంక్ చె‌క్కు మీద సంతకం పెట్టినట్లు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని శ్రీమతి షర్మిల అన్నారు. 60 శాతం ప్రజలకు అన్యాయం జరిగినా కాంగ్రెస్‌ను చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.

ఓట్లేసి గెలిపించిన ప్రజలకంటే కాంగ్రెస్, టిడిపి నాయకులకు పదవులే ఎక్కువయ్యాయని ఆమె అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైయస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ‌తన వంతుగా పోరాడుతోందన్నారు. జగనన్న, శ్రీమతి విజయమ్మ సహా వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ రాజీనామాలు చేశారని శ్రీమతి షర్మిల తెలిపారు. రాష్ట్ర విభజనకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌, సిపిఎం, ఎంఐఎం పార్టీలు ఎప్పుడూ అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదన్నారు. చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణకు వ్యతిరేకమని చెప్పి ఈ మూడు పార్టీల పక్కన చేరాలని సూచించారు. సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణకు తాను అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలని శ్రీమతి షర్మిల డిమాండ్‌ చేశారు.

Back to Top