సామాన్యుల సంక్షేమ‌మే మహానేత ఆలోచన

కెరాసుపల్లి (వైయస్‌ఆర్‌ జిల్లా),

22 మే 2013: దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలు నిరంతరం రైతులు, సామాన్య ప్రజల సంక్షేమం చుట్టూనే ఉండేవని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ గుర్తుచేసుకున్నారు. ఆ మహానేత హయాంలో ఏ చార్జీలు పెంచలేదని అన్నారు. వృద్ధులకు పెన్షన్లు పెంచి, సకాలంలో అందించారని తెలిపారు. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి పేదలకు కార్పొరేట్ వైద్యం అందేలా చూశారన్నారు. పేదల పిల్లకు పెద్ద చదువులు చెప్పించార‌ని పేర్కొన్నారు. వైయస్‌ఆర్ జిల్లా చక్రాయపేట మండలంలోని కె.ఎర్రగుడి-రాజుపల్లె తాగునీటి పథకాన్ని బుధవారంనాడు శ్రీమతి విజయమ్మ ప్రారంభించారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైతే తాగు, సాగు నీటికి కొరత లేకుండా చేస్తామని శ్రీమతి విజయమ్మ హామీ ఇచ్చారు. శ్రీమతి విజయమ్మ పులివెందుల ఎమ్మెల్యేగా కూడా వ్యవహరిస్తున్నారు. పులివెందుల సూపర్ స్పెషాలిటి పశువైద్యశాల ప్రారంభోత్సవా‌న్ని ప్రభుత్వం అడ్డుకోవడాన్ని శ్రీమతి విజయమ్మ తప్పుబట్టారు. సూపర్ స్పెషాలిటి పశువైద్యశాలను మనమే జాతికి అంకితం చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో దివంగత ‌మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ఈ ఆస్పత్రిని పూర్తిచేయడానికి కాంగ్రె‌స్ ప్రభుత్వం నాలుగేళ్లు తీసుకుందని శ్రీమతి విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రభుత్వం మహానేత పథకాలను తొంగలో తొక్కిందని శ్రీమతి విజయమ్మ దుయ్యబట్టారు. జగన్‌బాబు బయటికి రాగానే రాజన్నరాజ్యం దిశగా మనందర్నీ నడిపిస్తారని ఆమె హామీ ఇచ్చారు. తమకు ఎవరు మంచి చేస్తారో ప్రజలు తెలుసుకోవాలని, వారికే అధికారం అప్పగించాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు.

Back to Top