చంద్రబాబును నమ్మి భూములివ్వం


బోరుపాలెం(గుంటూరు జిల్లా) నవంబర్ 17: రుణ మాఫీ చేస్తానని ఊరూరా తిరిగి వాగ్దానం చేసి.. తీరా ఇప్పుడు సవాలక్ష ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నమ్మి రాజధానికి భూములు ఎలా ఇవ్వాలని ప్రతిపాదిత ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ప్రశ్నించారు. రుణ మాఫీ విషయంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని రాజధాని విషయంలో ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. రుణ మాఫీని అమలు చేయలేని ముఖ్యమంత్రి రాజధాని నగరం నిర్మించాక మమ్మల్ని ఏసీ గదుల్లో ఉంచుతానంటే, ఏరో ప్లేన్లలో తిప్పుతానంటే ఎలా నమ్మాలి అని వారు నిలదీశారు. తరతరాల నుంచి నేల తల్లిని నమ్ముకుని బతుకుతున్న తాము ఆ భూములను కోల్పోయి వచ్చిన కొద్ది డబ్బులతో ఎంతకాలం కూర్చుని తినగలుగుతామని ప్రశ్నించారు. ఈ విధంగా చంద్రబాబునాయుడు రైతుల్ని సోమరిపోతుల్ని, బికారులను చేయాలనుకుంటున్నారా? అంటూ వారి అభిప్రాయాలు తెలుసుకోవడానికి వచ్చిన వైఎస్సార్సీపీ రాజధాని రైతుల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులకు శరపరంపరగా ప్రశ్నలు సంధించారు.

ప్రతిపాదిత రాజధాని ప్రాంత గ్రామాల పర్యటనలో భాగంగా సోమవారం వైఎస్సార్సీపీ రాజధాని రైతు హక్కుల పరిరక్షణ కమిటీ తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామాన్ని సందర్శించి అక్కడి రైతుల కష్టనష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ పర్యటనలో కమిటీ కన్వీనర్ ధర్మాన ప్రసాదరావుతో పాటు మాజీ మంత్రి కె. పార్థసారథి, సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, గొట్టిపాటి రవికుమార్, ఉప్పులేటి కల్పన, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తాఫా, రైతు సంఘం నాయకుడు ఎంవీఎస్ నాగిరెడ్డి, ఎస్సీఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్ష్యుడు మేరుగ నాగార్జున, తాడికొండ నాయకురాలు క్రిస్టినా తదితరులు పాల్గొన్నారు.

ప్రాణం పోయినా ఏడాదికి మూడు పంటలు, ఉద్యానవన పంటలు పండే జరీబు(సారవంతమైన) భూములను రాజధానికి ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పారు. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని చెబుతూ.. రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాలు, 30వేల ఎకరాలు ఎందుకు అని వారు నిలదీశారు. రైతుల భూములతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడా? అని ప్రశ్నించారు. ప్రైవేటు స్థలాలను అభివృద్ది చేయడానికి ఇస్తే.. సదరు బిల్డర్ గుడ్ విల్ కింద కొంత మొత్తం ముందే ముట్టజెబుతాడని.. నిర్మాణం పూర్తి అయ్యాక 50-50 నిష్పత్తి ప్రకారమో లేక 60-40 నిష్పత్తి ప్రకారమో అభివృద్ది చేసిన అపార్టుమెంట్లను గానీ, షాపింగ్ కాంప్లెక్సులుగానీ ఇస్తారనీ.. ఇక్కడ మాత్రం నయా పైసా ఇవ్వకుండా రైతుల భూములను లాక్కోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.

ఇది కార్పోరేట్లకు దోచిపెట్టే చర్య అన్నారు. ఎకరానికి వెయ్యి గజాల స్థలం ఇస్తాననడం రైతులను దోచుకోవడమే అన్నారు. ఊర్లో ఇల్లు పెట్టుకుని.. చంద్రబాబు ఇచ్చే వెయ్యి గజాల్లో ఇల్లు కట్టుకోవాల్సిన ఖర్మ తమకు పట్టలేదన్నారు. తిండి పెట్టే భూములు ఇచ్చి.. చేతిలో ఉపాధి పోగొట్టుకొని ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. అవసరమైతే మెట్ట భూములను రాజధాని నిర్మాణం కోసం ఇస్తామని స్పష్టం చేశారు. అదికూడా మెట్ట భూములకు ప్రభుత్వం ఇస్తామన్న పరిహారం కాకుండా.. ఎకరానికి 1500 గజాలు అభివృద్ది చేసిన భూమితోపాటు ఏడాదికి లక్ష నుండి లక్షన్నర వరకు పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రైతు కూలీలకు ప్రతి నెలా జీవనోపాధి కొరకు రూ. 5 వేలు ఇవ్వాలని బోరుపాలెం రైతుకూలీ వీర రాఘవులు డిమాండ్ చేశారు.

రాజధాని నిర్మిత ప్రాంతంలో రైతులకు లక్షన్నర రుణ మాఫీ చేయటం కాదని.. వారికి సంపూర్ణంగా తాకట్టుపై ఉన్న బంగారం రుణాలతోసహా అణాపైసలతో సహా రుణ మాఫీ చేయాలని మరో రైతు ఆళ్ల పూర్ణ డిమాండ్ చేశాడు. కాల పరిమితి అంటూ ఏమీ లేకుండా.. ముందు మీరు భూములు ఇవ్వండి.. తర్వాత మేం డెవలప్ చేసి ఇస్తాం అని ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదని తిరుమల శేషగిరిరావు అనే రైతు స్పష్టం చేశాడు. ఎన్నికల హామీల మాదిరిగా నోటి మాటలతో చెప్పడం కరెక్టు కాదని.. ప్రభుత్వం చేస్తున్న ప్రతి ఒక్క ప్రతిపాదనకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

నిమ్మతోటకు ఏడేళ్లపాటు ఏటా ఎకరానికి లక్ష చొప్పున పెట్టుబడి పెట్టామని.. తీరా పంట చేతికొచ్చే సమయంలో భూములు ఇచ్చేయమంటే నోటి దగ్గరి తిండి తీయడమేనని దాసరి కోటేశ్వరరావు అనే రైతు వాపోయాడు. తరతరాలుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న తమను భూమినుంచి వెళ్లగొట్టడం అంటే తల్లి నుంచి బిడ్డను వేరుచేయడమేనని కారుమంచి వెంకటేశ్వరరావు అనే రైతు ఆవేదన చేందాడు. మంత్రులు తమ మందీ మార్భలాలతో గ్రామాల్లోకి వచ్చి.. పోలీసులను పక్కనపెట్టుకుని భూములు ఇవ్వడానికి రైతులు అంగీకరిస్తున్నారని కొన్ని పత్రికల్లో రాయించుకుంటున్నారని అది ఎంతమాత్రం వాస్తవం కాదన్నారు.

చివరగా పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాజధాని భూములు సేకరించే విషయంలో చట్టబద్ధంగా వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ చూడనట్టుగా అధికార పార్టీకి చేందిన మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల మీద పడి.. భూములు ఇస్తారా? చస్తారా? అన్నట్టుగా బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు. దాంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలను ప్రజలు తిరస్కరించారని.. వారు మాట్లాడే హక్కు లేదని మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం, ప్రతిపక్షం రెండూ కలిస్తేనే ప్రభుత్వం అన్నది గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.

రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన మంత్రులు ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబునాయుడికి ప్రజలు 5 ఏళ్లు పరిపాలించమని మేండేట్ ఇస్తే.. 2022 లోపల సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం చేపట్టి 6 నెలలు గడుస్తున్నా చంద్రబాబు ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయలేని అసమర్థ సీఎం అని తూర్పారబట్టారు. చంద్రబాబు వాగ్దానాలు చూస్తుంటే.. దూడ ఈనిందంటే.. బిడ్డను చేట్టుకు కట్టేయ్ అన్న చందంగా ఉన్నాయని అన్నారు.

చంద్రబాబు సింగపూర్ వెళ్లొచ్చే బదులు మన దేశంలో వేర్వేరు రాష్ట్రాల్లో రాజధాని ఎలా నిర్మించారో చూసి ఉంటే బాగుండేదన్నారు. ప్రపంచంలో ఎక్కడా సారవంతమైన భూముల్లో రాజధాని నిర్మించలేదని చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ కూడా కొండలు గుట్టల్లోనే కట్టారన్నారు. రైతుల ఉసురుపోసుకుంటూ.. వారి ఏడుపుల మీద రాజధాని నిర్మించకూడదని హితవు చెప్పారు. శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గుంటూరు-విజయవాడ ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని అసెంబ్లీలోనే చెప్పారని.. అయితే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ ఉందో అక్కడ నిర్మించాలని చెప్పారని ఈ సంధర్భంగా ఉమ్మారెడ్డి గుర్తు చేశారు.

Back to Top