ప్రత్యక్ష ఆందోళన చేద్దాం..రండి..!

() ప్రత్యేక హోదా తెచ్చేందుకు ఉద్యమిద్దాం

() ప్రత్యక్ష ఆందోళనకు దిగుదాం

() మీరు సిద్ధమా చంద్రబాబు

() ఈనెల 10న కలెక్టరేట్ ల ఎదుట ధర్నాలు

() కార్యాచరణ ప్రకటించిన మాజీమంత్రి బొత్సా

హైదరాబాద్) ప్రత్యేక హోదా మీద ప్రత్యక్ష పోరాటానికి తాము సిద్ధమని,  ఇందుకు ప్రభుత్వం కలిసి వస్తుందా అని
వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి బొత్సా సత్యనారాయణ నిలదీశారు. ఈ నెల
10న ఆందోళన చేపడుతున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్సార్సీపీ
కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బొత్స ఏమన్నారో ఆయన మాటల్లోనే
చూద్దాం.

     కేంద్రంతో సఖ్యతగా ఉండాలి
అంటున్నారు. ప్రత్యేక హోదా మీద మీ వైఖరి ఏమిటి అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.
చట్టంలో పెట్టలేదు అని చెబుతున్నారు బాగానే ఉంది కానీ, చట్టంలో పెట్టిన పోలవరం,
రైల్వే జోన్ అంశం మీద మాట్లాడరు. వీటితో పాటు ప్రత్యేక హోదా మీద మేం
పోరాడుతున్నాం. ముఖ్యమంత్రేమో హోదా అనేది సంజీవని కాదు అంటున్నారు. ఇది సంజీవని
అని మేం అంటున్నాం. మీరే రక రకాలుగా మాట్లాడుతూంటే కేంద్ర మంత్రి అలా అనకుండా ఎలా
అంటారు. చట్టంలో పెట్టలేదని కాసేపు, ప్యాకేజీ ఇస్తే సరిపోతుంది అని కాసేపు చెబుతూ
ఉంటే అవే కేంద్ర నేతలకు ఊతం ఇచ్చాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ దేశంలో ప్రత్యేక
హోదా కల్పించిన ఏ రాష్ట్రానికీ కూడా హోదా గురించి చట్టంలో పెట్టనే లేదు. దీనికి
నీతి అయోగ్ కు ముడిపెడుతున్నారు. దీనికి నీతి అయోగ్ కు సంబంధం లేదు. గత
ప్రభుత్వంలోనే క్యాబినెట్ తీర్మానం చేసింది. అప్పుడు ఉన్న ప్రణాళికా సంఘానికి
పంపించింది.

     మేమూ, మా నాయకుడు వైఎస్ జగన్
ప్రత్యేక హోదా మీద పోరాడుతున్నాం. మేం అంతా ఢిల్లీలో ధర్నా చేశాం. ఆంధ్రప్రదేశ్ లో
నిరాహార దీక్ష చేశారు. అప్పుడు టీడీపీ నేతలు హేళన చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం
అన్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం అన్నారు. మీరు ఎంత హేళన చేసినా మేం చలించలేదు. ఈ
రాష్ట్రంలో యువత, విద్యార్థులు ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు. గల్లీలో ఒక
మాట చెబుతున్నారు, పట్టణంలో మరో మాట చెబుతున్నారు, ఢిల్లీలో ఇంకో మాట చెబుతున్నారు.
నాయకత్వమే ఈ విధంగా మాట్లాడుతుంటే పరిస్థితి ఏమిటి.

     చంద్రబాబు నాయుడిని సూటిగా ఒకటే
ప్రశ్న అడుగుతున్నా. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా మీకు .. వ్యక్తిగత ప్రయోజనాలు
ముఖ్యమా మీకు.. అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ప్రాంతీయ అంశాలే
ముఖ్యం. తమిళనాడులో చూసినా, మహారాష్ట్రలో చూసినా, చివరకు తెలంగాణ లో చూసినా అక్కడ
ప్రజల అవసరాల కోసం పార్టీలు పోరాడుతుంటాయి. మీరు ఆ విధంగా ఎందుకు ప్రయత్నించటం
లేదు. ఢిల్లీలో మీ మంత్రులు ఇద్దరు ఉన్నారు. అక్కడ ఎందుకు నిలదీయలేకపోతున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కన్నా మీకు మీ స్వార్థం ముఖ్యం. ఏ ఒక్కదాని మీద మీకు చిత్త
శుద్ధి లేదు. మీకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. సొంత
అవసరాలు ఉన్నాయి. మీ మనుషులకు అవసరాలు ఉన్నాయి. మీ కేసుల చిక్కులు మీకు ఉన్నాయి.
అందుచేతనే మీరు అలా వ్యవహరిస్తున్నారు.

     ప్రతిపక్షంగా మేం సహకరిస్తాం అని
చెబుతున్నా మీరు మాత్రం ముందుకు రావటం లేదు. నీటి అవసరాలు ఏ రకంగా తీర్చుకోవాలి
అనేది చట్టంలో పెట్టారు. ఎగువ ప్రాంతాలు నీటిని తోడేసుకొంటున్నాయి, అదే జరిగితే
దిగువ ప్రాంతాలకు కష్టం వస్తుంది అని వైఎస్ జగన్ దీక్షకు దిగుతుంటే టీడీపీ  లో చలన వచ్చింది. అప్పటి దాకా ఉలుకు పలుకు
లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకు రండి అంటే ఏమాత్రం రావటం లేదు. మేం టీడీపీని
అడుగుతున్నాం. అంతా కలిసి ఉద్యమిద్దాం. సమైక్య ఉద్యమం తరహాలో సకలం బంద్ చేద్దాం.
ఒక వారం, రెండు రోజులు... ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో ఉద్యమాన్ని చేసుకొందాం.
ప్రభుత్వ పరంగా సహకరిస్తారా అని అడుగుతున్నా. ఆంధ్ర ప్రజల ప్రయోజనాల కావాలి అంటే
మీరు ముందుకు రండి. మీరు రారు.

ఎందుకంటే మీకు కేంద్రంలో పదవులు కావాలి. కేసుల
నుంచి ఉపశమనం కావాలి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే దాకా మేం పోరాడుతాం అని
మా నాయకుడు వైఎస్ జగన్ స్పష్టంగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు
వంచైనా ప్రత్యేక హోదా సాధిస్తాం అని స్పష్టంగా చెప్పారు. అదే రీతిలో నిరాహార దీక్ష
చేశారు. దఫ దఫాలుగా ఉద్యమించారు. అందుకే ఇప్పుడు కార్యాచరణ ప్రకటిస్తున్నాం.

     ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల
కలెక్టరేట్ ల ఎదుట ఆందోళన నిర్వహిస్తాం. ఉదయం పదకొండు గంటలకు ధర్నా చేసి ఆయా
జిల్లాల కలెక్టర్ లకు వినతి పత్రాలు సమర్పిస్తాం. ఈ ధర్నాలో పార్టీ అధ్యక్షులు
వైఎస్ జగన్ పాల్గొంటారు. కాకినాడలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ దగ్గర జరిగే
ఆందోళన లో పాలు పంచుకొంటారు. ప్రజలంతా దీనికి సహకరించాలని కోరుకొంటున్నాం.

     అని బొత్సా సత్యనారాయణ అభిప్రాయ
పడ్డారు.ఈ సమావేశంలో మాజీ మంత్రి పార్ధ సారధి పాల్గొన్నారు. 

Back to Top