రైతులను ప్రేమతో ఆదుకున్న మహానేత: షర్మిల

తెనాలి 20 మార్చి 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి రైతులను ఎంతో  ప్రేమించారని ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. గుంటూరు జిల్లా తెనాలిలో బుధవారం రాత్రి నిర్వహించిన భారీ బహిరంగ సభలో జగన్నినాదాలు, ప్రజల హర్షాతిరేకాల నడుమ ఆమె ఉత్సాహపూరితంగా ప్రసంగించారు. ఇసకేస్తే రాలనంతమంది ఆమె సభకు హాజరయ్యారు.
మహానేత రైతన్నలను అన్నివిధాలుగా ఆదుకున్నారని శ్రీమతి షర్మిల తెలిపారు.  డాక్టర్ వైయస్ రైతులకు బ్రహ్మాండమైన మద్దతు ధర కల్పించారన్నారు. రైతులు నష్టపోతే నష్టపరిహారం సకాలంలో చెల్లించిన ఘనత ఆయనదన్నారు. రైతులంటే వైయస్ఆర్కు ఎంత ప్రేమో దీన్ని చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.

నేడు రాష్ట్రంలో రైతులు అల్లాడిపోతున్నారనీ, బకాయిలు తీర్చలేక కిడ్నీలు అమ్ముకుంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పరిస్థితయితే దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. కూలీ పనికి వెళ్తేగానీ కుటుంబం గడవని పరిస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తంచేశారు. తాగడానికి నీళ్లు కూడా ఇవ్వని ఈ ప్రభుత్వం ఉన్నట్లా? చచ్చినట్లా? అని ప్రశ్నించారు. ఏ వస్తువును ముట్టుకున్నా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుల ఛార్జీలు ఇప్పటికే రెండు సార్లు పెంచేశారన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ఐదేళ్లలో ఏ ఒక్కరోజు ఆర్టీసీ చార్జీలు పెంచని విషయాన్ని గుర్తుచేశారు. గ్యాస్ ధరలు, విద్యుత్ చార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదని చెప్పారు. పన్నులు వేయకుండా సంక్షేమ పథకాలను అమలుచేశారనీ, ఇది చాలు మహానేత మనసు తెలుసుకోవడానికి అని ప్రజల హర్షాతిరేకాల మధ్య  చెప్పారు. ప్రస్తుత పాలకులు విద్యుత్తు ఇవ్వరు, కానీ చార్జీల మీద సర్ఛార్జీలు వేస్తారని ఎద్దేవా చేశారు. 7 గంటలు కాదు ఇచ్చిన 3 గంటలు కూడా విద్యుత్తు ఏ సమయంలో ఇస్తారో దేవుడికి కూడా తెలీదని చెప్పారు. విద్యుత్తు కోతలతో 20 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ముందు చూపులేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

సొంతమామని వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ ఎక్కారని చంద్రబాబును ఉద్దేశించి తీవ్రంగా విమర్శించారు. ఆయన రైతులను మనుషులను చూసినట్లు కాకుండా పురుగులు చూసినట్లు చూశారు. అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లు వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులను ఆప్తులకు కారుచౌకగా ఇచ్చారని మండిపడ్డారు. ఎనిమిదేళ్ళ ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన  పనిచేసి 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. విద్యుత్తు  బిల్లులు కట్టలేమంటే కేసులు పెడతామని హెచ్చరించారు. ఉచిత విద్యుత్తు ఇస్తే కరెంటు తీగలపై దుస్తులారవేసుకోవాల్సి వస్తుందన్న చంద్రబాబు ఇప్పుడు అదే ఉచిత విద్యుత్తు ఇస్తానని హామీ ఇస్తున్నారనీ, ఏరకంగానైనా తిరిగి అధికారంలోకి రావాలని ఆయన భావిస్తున్న విషయం దీనితో వెల్లడవుతోందన్నారు. చంద్రబాబు హింసలు భరించలేక వేలాది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. బిల్లులు కట్టకపోతే రైతులు, మహిళలను జైళ్లలో ఉంచారు. బాబు హయాంలో రైతులు అల్లాడిపోయారన్నారు. ఉపకార వేతనాలు ఇమ్మని కోరిన విద్యార్థులను లాఠీలతో కొట్టించారని శ్రీమతి షర్మిల ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు ఫీజు రీయింబర్సుమెంటు అమలుచేస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. ప్రజల బాధలను చూసి బాబు ఎప్పుడైనా కన్నీరు పెట్టుకున్నారా అని అడిగారు. చంద్రబాబు తన పాలనలో రుణమాఫీ ఎందుకు చేయలేదో వివరించాలని డిమాండ్ చేశారు. ఆయనను నాయకుడనాలా ఊసరవెల్లి అనాలా అని ఆమె ప్రశ్నించారు.

వైయస్ఆర్ పథకాలను మళ్ళీ తేగలమని తాము చెప్పగలమనీ, సొంత పథకాలను తిరిగి అమలు చేస్తానని చెప్పగలరా అంటూ  చంద్రబాబును నిలదీశారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఆ స్థానాలలో ఉప ఎన్నికలకు వెళ్ళగలరా అని కూడా అడిగారు.  దమ్ముంటే స్థానిక ఎన్నికలకు పార్టీ గుర్తులతో వెళ్ళాలని ఆమె కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

పాదయాత్రలో తనను కలిసిన రైతులు... మహానేత ఉండగా ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వర్షం వచ్చిందనీ, కాలువలు ఎప్పుడూ ఎండిపోలేదనీ చెప్పారని శ్రీమతి షర్మిల పేర్కొన్నప్పుడు ప్రజలు హర్షాతిరేకాలను వ్యక్తంచేశారు. జై వైయస్ఆర్ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది.

Back to Top