రానున్న ఎన్నికల్లో 'వైయస్ఆర్' ప్రభంజనం

హైదరాబాద్, 26 జనవరి, 2013:

వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేయనున్నాయి. అలాగే... శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కట్టబెట్టి అధికారంలోకి తేనున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆ పార్టీ తన ఆధిపత్యాన్ని చాటనుంది. ఇండియా టుడే పత్రిక నీల్సన్ సంస్థతో సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అత్యధిక స్థానాలలో గెలుచుకోవడమే కాక.. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభలో అది పెద్ద పార్టీగా అవతరించనుందనేది 'మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' పేరిట నిర్వహించిన ఆ సర్వే వెల్లడించిన సారాంశం. సర్వేలో పలకరించిన వారిలో 64 శాతం మంది శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో కాంగ్రెస్ పెట్టించినవేనన్న అభిప్రాయాన్ని వెల్లడించారు.

     కిందటి లోక్ సభ ఎన్నికలలో 33 స్థానాలను సాధించిన కాంగ్రెస్ ఈ సారి ఎనిమిది స్థానాలకే పరిమితం కానుందనీ, కేవలం 18 శాతం  ఓట్లు మాత్రమే పొందుతుందనీ తేలింది. 2009 ఎన్నికలలో 52.5 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది.
కాంగ్రెస్ ఓటు బ్యాంకును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతుందని సర్వేలో తేలింది.
అలాగే.. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రులు ఎవరనే అంశంపై  నిర్వహించిన సర్వేలో కిరణ్‌కుమార్ రెడ్డికి ఎనిమిదో స్థానం లభించింది.

ఎన్డీఏ పరిస్థితి కొద్దిగా మెరుగు

     కిందటి ఎన్నికలలో 259 సీట్లు పొందిన కాంగ్రెస్ ఈసారి 152 నుంచి 162  సీట్లు మాత్రమే గెలవగలదని సర్వేలో వెల్లడైంది. ఎన్డీఏ తన సీట్లను 198నుంచి 208 సీట్లకు పెంచుకోనుందని కూడా సర్వే తేల్చింది. ప్రధాని అంశానికి సంబంధించిన నిర్వహించిన సర్వేలో రాహుల్ గాంధీకి 41 శాతం మందీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి 57 శాతం మంది మద్దతు పలికారు.

Back to Top