రాజకీయంగా ఎదుర్కొలేకనే అక్రమ కేసులు

ఒంగోలు:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ జగన్మోహనరెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైళ్లో పెట్టారని వైయస్ఆర్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పోటీ చేసినా ఉప ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించిందన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని పార్టీలు సీబీఐని పావుగా వాడుకుని శ్రీ జగన్మోహనరెడ్డి బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డి నిర్దోషని జనం నమ్ముతున్నారనే విషయం ఉప ఎన్నికల్లో నిరూపణ అయిందన్నారు.

     'జగన్ కోసం... జనం సంతకం' కార్యక్రమం ఆ పార్టీ ప్రచార కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులోని బాలినేని నివాసంలో ఆదివారం ప్రారంభమైంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్‌బాబు తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా బాలినేని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు నమ్ముతున్న నిజాన్నే రాష్ట్రపతికి కూడా వివరించాలనే సంకల్పంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరించేందుకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఈ కోటి సంతకాలతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐ, టీడీపీలకు కనువిప్పు కావాలన్నారు.

200 రోజులు దాటినా బెయిల్ రాకపోవడం దారుణం

శ్రీకాకుళం: శ్రీ జగన్మోహనరెడ్డికి వస్తున్న ప్రజాభిమానం, ఆదరణ చూసి తట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. 'జగన్ కోసం...జనం సంతకం' కార్యక్రమంలో భాగంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణదాసు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లడమే శ్రీ జగన్మోహనరెడ్డి చేసిన నేరంగా కాంగ్రెస్ భావించిందన్నారు. దానిపై కక్షతో లేనిపోని ఆరోపణలు చేయడమే కాకుండా అక్రమ ఆస్తుల కేసును బనాయించి జైల్లో పెట్టించారన్నారు. శ్రీ జగన్మోహనరెడ్డిని అరెస్ట్ చేసి 200 రోజులు దాటినా బెయిల్ మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్, టీడీపీలు మ్యాచ్‌ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ధర్మాన కృష్ణదాసు మండి పడ్డారు.

Back to Top