ఇచ్ఛాపురంలో పైలాన్ పను‌‌లు ప్రారంభం

ఇచ్ఛాపురం (శ్రీకాకుళం జిల్లా) :

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో ఆవిష్కరించనున్న పైలాన్ పనులకు ఆదివారం శ్రీకారం చుట్టారు. మహానేత డాక్ట‌ర్ వైయస్ ‌రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థాన విజయస్థూపం ఎదురుగా సేకరించిన స్థలంలో ఈ ‌పైలాన్ పనులు ప్రారంభమయ్యాయి. వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి పరిశీలించారు.

అంతకు ముందు పార్టీ సిజిసి సభ్యుడు, ఇచ్ఛాపురం నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఎం.వి.కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరా‌జ్ తండ్రి రాజారావు ఇతర నాయకులతో పైలా‌న్ నిర్మాణంపై సుబ్బారెడ్డి చర్చించారు. పైలా‌న్ ఎలా ఉంటుందో నమూనా చూపించి వివరించారు. నిర్మాణం ఎలా ఉండాలో స్థానిక సివిల్ ఇంజినీ‌ర్ గిరి, నిర్మాణ నిపుణుడు భోగేశ్వరరావుకు కొలతలతో సహా వివరించారు. దగ్గరుండి స్థలంలో మార్కింగ్ వేయించారు. జేసీబీతో చేపట్టిన పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. పాదయాత్ర ఆగస్టు 4న ముగిసే అవకాశం ఉందని, ఈలోగా నిర్మాణం పూర్తిచేయాలని పార్టీ నాయకులను‌ ఆయన ఆదేశించారు. పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడానికి ఇచ్ఛాపురంలోనే బసచేయాలని పార్టీ నేత కొయ్య ప్రసాదరెడ్డికి సుబ్బారెడ్డి సూచించారు. వర్షం వల్ల పనులకు ఆటంకం కలగకుండా టెంట్ ఏర్పాటు చేయాలన్నారు.

‌ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా మహిళా విభాగం కన్వీనర్ బొడ్డేపల్లి పద్మజ, ఎస్సీ సె‌ల్‌ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ఎస్.దేవరాజ్, పార్టీ మునిసప‌ల్ కన్వీన‌ర్ పిలక పోలారావు, మండల కన్వీనర్లు కారంగి మోహనరావు, బి.హరిబాబు, నాయకులు పి.కోటి, పిట్ట ఆనంద్, ఎం.వెంకటరెడ్డి, గుజ్జు తారకేశ్, పిలక విజయభాస్కర్, ప్రకా‌శ్ పట్నాయక్, సాలిన ఢిల్లీ తదితరులు పాల్గొన్నారు.

Back to Top