<strong>ములకలూరు (గుంటూరు జిల్లా), </strong>6 మార్చి 2013: కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో కరెంటు కష్టాలు వచ్చిపడ్డాయని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. కిరణ్ ప్రభుత్వం అనాలోచితంగా విధిస్తున్న విద్యుత్ కోతల కారణంగా రైతులు, విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జననేత జగనన్న నేతృత్వంలో రాజన్న రాజ్యం వచ్చాక అందరి కష్టాలూ తీరిపోతాయని శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.<br/>అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారంనాడు గుంటూరు జిల్లా ములకలూరులో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి షర్మిల ముందుగా స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు శ్రీమతి షర్మిలకు తాము ఎదుర్కొంటున్న కరెంటు సమస్యలు, రైతన్నల కష్టాల గురించి చెప్పుకున్నారు. గ్రామాల్లో కరెంటు నాలుగు గంటలు కూడా ఉండడంలేదని వారు వాపోయారు. విద్యుత్ ఉండని కారణంగా మంచినీరు కూడా సరఫరా కావడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కరెంటు లేక తమ పిల్లలు పరీక్షలకు సరిగా చదువుకోలేకపోతున్నారని చెప్పారు. జననేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నవ్వుతూ జైలు నుంచి బయటికి వస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. <br/>కాగా, శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్ర బుధవారంనాటికి 83వ రోజుకు చేరింది. నరసరావుపేట టౌన్‌లో పాదయాత్ర కొనసాగనుంది. ఇసప్పాలెం, పెద్దచెరువు, రెడ్డినగర్, చెక్‌పోస్టు, ఓల్డు పల్నాడు బస్టాండ్, క్రిస్టియన్‌పాలెంలో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు.