క్రమశిక్షణతో పనిచేస్తే విజయం తథ్యం

తెలంగాణలో పార్టీ పటిష్టతపై కసరత్తు
రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు వ్యూహం
పలు కీలక అంశాలపై నేతల చర్చ

తెలంగాణలో పార్టీ పటిష్టతపై వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు కమిటీలను బలోపేతం చేసి పార్టీ విస్తరణ కార్యక్రమాలను చేపట్టనుంది. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ . రాజశేఖర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తున్నారని, పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో ఆదరాభిమానాలు, ప్రేమ ఉన్నాయని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతోనే వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినట్టు చెప్పారు. రాజన్న  పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణకు, జగన్‌పై అభిమానానికి ...ఎన్నికల ప్రచారంలో పార్టీ అధినేతకు ప్రజలు పలికిన నీరాజనాలే నిదర్శనమన్నారు.

గ్రామస్థాయిలో పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను ఓట్ల రూపంలో వేయించగలిగేలా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందని పొంగులేటి తెలిపారు. వరంగల్ లోక్‌సభ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు పార్టీ సంస్థాగత అంశాలపై హైదరాబాద్ లోటస్ పాండ్ లో పార్టీ నేతలతో పొంగులేటి  చర్చించారు. రాష్ర్టంలో పార్టీని మరింత పటిష్టం చేసి, విస్తరించేందుకు వరంగల్ ఎన్నికల్లో పోటీచేశామన్నారు. గెలుపోటములు సహజమని ఆయా పరిణామాలతో కుంగిపోవాల్సిన అవసరం లేదని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

 
వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, క్రమశిక్షణను ఉల్లంఘించే వారిని ఉపేక్షించే ప్రసక్తి ఉండదని పొంగులేటి స్పష్టంచేశారు. పార్టీ నియమావళికి కట్టుబడి, అందరూ క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. పార్టీపరంగా చేపట్టే ఏ కార్యక్రమం అయినా ఆషామాషీగా తీసుకోకుండా అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేయాలని పార్టీ నాయకులకు సూచించారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలికి జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేసే విషయమై, అదేవిధంగా అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించారు. పార్టీ విధివిధానాలకు అనుగుణంగా నడుచుకోవాలని పొంగులేటి నాయకులకు సూచించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ అధినేత జగన్‌తో సుదీర్ఘంగా చర్చించానని, పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పొంగులేటి స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగతంగా బలోపేతమైతే ఏ ఎన్నికల్లోనైనా విజయం తథ్యమన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా వాటిలో పాల్గొనాలని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం  చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు దొమ్మాటి సాంబయ్య త్వరలోనే వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు ప్రకటించారు. 

Back to Top