అనంతపురం, 26 అక్టోబర్ 2012: షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం అనంతపురం జిల్లాలో శుక్రవారంనాడు విజయవంతంగా కొనసాగుతోంది. వేలాది మంది ఆమె వెంట నడుస్తూ మద్దతు తెలుపుతున్నారు. షర్మిల పాదయాత్ర మార్గంలో స్థానికులు, వైయస్ అభిమానులు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నుంచి అశేష ఆదరణ లభిస్తోంది. మధ్యాహ్నానికి షర్మిల పాదయాత్ర ధర్మవరం సమీపానికి చేరుకుంటున్నది. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారిని ఓదారుస్తూ షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ధర్మవరంలోని శివానగర్, పేరుబజార్, అంజుమన్ సర్కిల్ మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ధర్మవరం పిఆర్‌టి సర్కిల్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల ప్రసంగిస్తారు.
పాదయాత్ర సందర్భంగా షర్మిల మల్లేనిపల్లి చేరుకున్నప్పుడు సమీపంలోని పొలాల్లోకి వెళ్ళి రైతుల ఇక్కట్లు అడిగి తెలుసుకున్నారు. ఒక రైతు షర్మిల వద్దకు వచ్చి తన పొలంలో విత్తనాలు వేయాలని కోరారు. షర్మిల అందుకు అంగీకరించి ఆ రైతు పొలంలో అరక వెంట నడుస్తూ విత్తనాలు వేశారు. ఆ తరువాత రైతులతో మాట్లాడుతూ, గ్రామంలో విద్యుత్ ఎంతసేపు ఉంటోంది? మహానేత రాజన్న పాలనకు, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు మీరు గమనించిన తేడా ఏమిటని అడిగారు. విద్యుత్ కోతలు, విత్తనాల కొరత తదితర సమస్యలను ప్రస్తుతంలో ఎదుర్కొంటున్నట్లు షర్మిల ముందు రైతులు వాపోయారు. రాజన్న రాజ్యం ఉన్నప్పుడే తమకు అన్ని విధాలుగా బాగుండేదని వారు అన్నారు. తమ జీవితం దుర్భరంగా మారిపోయిందని వారు కన్నీరు పెట్టుకున్నారు. త్వరలోనే రాజన్న రాజ్యం జగనన్న నేతృత్వంలో వస్తుందని, అందరి కష్టాలూ తొలగిపోతాయని భరోసా ఇచ్చారు.
ధర్మవరంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేత:
మరోవైపున షర్మిల పాదయాత్ర సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం ధర్మవరంలో బహిరంగ సభను పార్టీ ఏర్పాటు చేసింది. ఈ సభలో వైయస్‌ఆర్ సిపి గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, షర్మిల మరికొందరు పార్టీ నాయకులు ప్రసంగిస్తారు. కాగా, గత రెండు మూడు రోజులుగా ధర్మవరంలో కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు పార్టీ స్థానిక నాయకులు ఆరోపించారు. షర్మిల పాదయాత్రకు సంబంధించి వివరాలను వైయస్ అభిమానులు ఎప్పటికప్పుడు తెలుసుకోకుండా చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు శుక్రవారం ఉదయం జిల్లాలోని తుమ్మల క్రాస్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది.