ఓటుతో ఆ విషసర్పాలపై వేటు వేయండి

కాకినాడ, 13 జూన్‌ 2013:

కాంగ్రెస్‌, టిడిపి విషసర్పాలపై ఓటు అనే ఆయుధంతో వేటు వేయండి అని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, టిడిపి నాయకుల పాపం పండే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. దేవుడు చూస్తున్నాడని వారి పాపాలను లెక్కగడుతున్నాడని హెచ్చరించారు. వారి పాపం పండిన రోజున పాపాల పుట్ట పగిలి దాని నుంచి వచ్చిన విష సర్పాలను ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో వేటాడి, తరిమి తరిమి కొట్టే రోజు ఒకటి దగ్గర్లోనే ఉందన్నారు. జగనన్న ఏ తప్పూ చేయలేదని, అందుకనే ధైర్యంగా ఉన్నారని శ్రీమతి షర్మిల చెప్పారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గురువారం సాయంత్రం కాకినాడలోని భావనారాయణ సెంటర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజా కంటక కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, కుమ్మక్కు, కుట్ర రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును, కాంగ్రెస్‌ పార్టీకి కాపలా కుక్కలా వ్యవహరిస్తున్న సిబిఐని తూర్పారపట్టారు.

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్టు వాద్రాపై అవినీతి ఆరోపణలు ఉంటే ఆయన ప్రైవేటు వ్యక్తి గనుక వివరాలు రహస్యం అని ప్రధాని కార్యాలయం చెప్పిందన్నారు. రాబర్టు వాద్రా ప్రైవేటు వ్యక్తి గనుక ఆయన పేరును తీసేశామని సిబిఐ చెప్పిందన్నారు.  మరి మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు ఎలాంటి రాజకీయాల్లోనూ లేని జగనన్న ప్రైవేటు వ్యక్తి కాదా? ఆయనపై ఎందుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని శ్రీమతి షర్మిల నిలదీశారు. కేంద్రం చేతిలో సిబిఐ కీలుబొమ్మ అని కేంద్రం చెప్పినట్లే పనిచేస్తుందని ఇప్పటికి ఎన్నిసార్లో రుజువైందని ఆరోపించారు. జగనన్న ఎ1గా, విజయసాయిరెడ్డి ఎ2గా ఉంటారని ఇంకా విచారణ కాక ముందే సిబిఐ అధికారులు ప్రకటన చేయడాన్ని శ్రీమతి షర్మిల తప్పుపట్టారు. అంటే జగనన్నను, విజయసాయిరెడ్డిని దోషులుగా ముందే నిర్ధారించేసి సిబిఐ ఆ దిశగాపూ కుట్రపూరితంగా విచారణ సాగిస్తోందని దుయ్యబట్టారు. ఏ కారణమూ చూపించకుండానే జగనన్నను సంవత్సర కాలంగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు.

నిజానికి జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూ, ధైర్యమూ కాంగ్రెస్‌, టిడిపి నాయకులకు లేదని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. అందుకే ఆయనపై కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న దోషి అని ఏ కోర్టూ నిర్ధారించలేదన్నారు.  చంద్రబాబు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ నిర్దోషులని కూడా ఏ కోర్టూ సర్టిఫికెట్‌ ఇవ్వలేదన్నారు.

రాజన్న రాజ్యం స్థాపించే రోజు త్వరలోనే వస్తుందని, అంత వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా ఉండాలని, తమతో కలిసి కదంతొక్కాని శ్రీమతి షర్మిల విజ్ఞప్తిచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏమున్నా ఏది లేకపోయినా దేవుడి బలం ఉందని, ప్రజల ఆదరణ ఉందని మీరు నిరూపించాల్సిన సమయం వచ్చిందని బహిరంగ సభకు హాజరైన ఆశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపిలకు ఓటు ఆయుధంతో గట్టిగా బుద్ధిచెప్పి, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని ఆమె విజ్ఞప్తిచేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషి అని చెబుతుందన్నారు. జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుందన్నారు.

రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మత్స్యకారులకు ఇప్పుడున్న లక్ష రూపాయల నష్టపరిహారం ఐదు లక్షలు అవుతుందని శ్రీమతి షర్మిల హామీ ఇచ్చారు. మత్స్యకారుడు గల్లంతైన నెలరోజుల్లోనే ఆ నష్టపరిహారాన్ని జగనన్న అందిస్తారని భరోసా ఇచ్చారు. అసమర్థ కాంగ్రెస్‌ విధానాలతో విసిగిపోయి, ప్రతిపక్షాలన్నీ కలిసి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాకినాడ అర్బన్‌ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సహా 15 మంది ఎమ్మెల్యేలు మార్చినెలలో ఓటు వేస్తే ఇన్ని నెలలూ ఊరుకుని కొద్ది రోజుల క్రితమే వేటు వేయడమేమిటని శ్రీమతి షర్మిల నిలదీశారు. జగనన్న మాటకు కట్టుబడి, ప్రజల పక్షాన నిలబడిన ఎమ్మెల్యేలపై వేటు వేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు.

ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ జరగనవి విధంగా చంద్రబాబు నాయుడు సాక్షి మీడియాను బహిష్కరించారని శ్రీమతి షర్మిల విచారం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ, సహనం. అయితే, ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేయడమే ఆయనకు తెలుసు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలను కూడా మహానేత ఏనాడు బాయ్‌కాట్‌ చేయలేదన్నారు.  సాక్షి అంటేనే నిజాలు రాసే పత్రిక. తనకు సంబంధించిన నిజాలనే సాక్షి రాస్తున్నదని చంద్రబాబుకు మంటగా ఉందన్నా రు.

చంచల్‌గూడ జైలులో జగనన్నకు చాలా సౌకర్యాలు అందుతున్నాయని ఆరోపించిన చంద్రబాబు తీరుపై శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. ఉచ్ఛ నీచాలు కూడా మరిచిపోయి, నోరు తెరిచి పలకడానికి కూడా సిగ్గుపడే మాటలతో చంద్రబాబు నాయుడు జగనన్నపై ఆరోపణలు చేశారని దుమ్మెత్తిపోశారు.

కాకినాడ సీ పోర్టు, కృష్ణపట్నం పోర్టు తదితర పోర్టులన్నింటినీ చంద్రబాబు పప్పు బెల్లాల్లా తన బినామీలకు కట్టబెట్టేశారు. మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఏ పథకాలు చేశారో వాటినే తానూ అమలు చేస్తానంటూ చంద్రబాబు ఊళ్ళమ్మట తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. మరి ఆయన సిఎంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడిగితే చంద్రబాబు నుంచి సమాధానం లేదన్నారు.

ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎవరు అవిశ్వాసం పెట్టినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇస్తుందని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల మరోమారు స్పష్టంగా చెప్పారు. విశ్వసనీయమైన రాజకీయాలు చేసే నైజం చంద్రబాబుకు లేదని ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వం పడిపోదు అని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే అవిశ్వాసం పెడతారని ఎద్దేవా చేశారు.

Back to Top