సమైక్య శంఖారావానికి అడ్డుతగలడం సరికాదు

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి నాయత్వంలో ఈ నెల 19న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభను అడ్డుకుంటామని ప్రకటించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. సమైక్య శంఖారావం సభను లాల్‌ బహదూర్ స్టేడియంలో ‌నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీ అధికార ప్రతినిధులు జూపూడి ప్రభాకరరావు, బి.జనక్‌ప్రసాద్, గట్టు రామచంద్రరావు, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్‌లతో కూడిన బృందం శుక్రవారం డిజిపి బయ్యారపు ప్రసాదరావుకు వినతిపత్రం సమర్పించింది. సభను శాంతియుతంగా నిర్వహించుకుంటామని, 19వ తేదీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఎల్‌బి స్టేడియంలో సభకు అనుమతివ్వాలని డిజిపికి వారు విజ్ఞప్తి చేశారు. ఎల్‌బి స్టేడియం నిర్వాహకులకు కూడా ఇప్పటికే లేఖ ఇచ్చామని వారు తెలిపారు.

హైదరాబాద్‌ నగర పోలీసులతో మాట్లాడిన తరువాత సభకు అనుమతిపై స్పష్టత ఇస్తానని డిజిపి తమకు హామీ ఇచ్చారని పార్టీ నాయకులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కొన్ని పార్టీలు, ప్రజా సంఘాలు సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామని ప్రకటించడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని అడ్డుకోవడం మంచిదికాదని అన్నారు. తెలంగాణ వాదం బలహీనమైనదిగా భావించినందునే సమైక్య శంఖారావం సభను అడ్డుకుంటామంటూ ప్రకటనలు చేస్తున్నారని వారు విమర్శించారు.

తాజా ఫోటోలు

Back to Top