ఆ ముగ్గురూ రాసుకుంటే బూడిదే!

గుంటూరు:

మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలసి మహాకూటమిగా పోరాడినా చంద్రబాబుకు ఫలితం దక్కలేదని వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆయన కొడుకు ముందు కూడా ఒంటరిగా నిలిచే దమ్ము చంద్రబాబుకు లేదని విమర్శించారు. అందుకే నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, పవన్ కల్యా‌ణ్‌లను మూకుమ్మడిగా జనంలోకి తీసుకొచ్చాడని దుమ్మెత్తిపోశారు. 'అయినా ఫరవాలేదు. జోగీజోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది’ అని శ్రీమతి షర్మిల విమర్శించారు. తిరుపతి సభలో ఈ ముగ్గురూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ వారిని కడిగిపారేశారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన ‘వైయస్ఆర్ జనభేరి’ సభల్లో ‌ఆమె ప్రసంగించారు.

తెలుగు ప్రజలను అడ్డగోలుగా విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముందని శ్రీమతి షర్మిల నిందించారు. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. ‘కొబ్బరి చెక్కల్లా విభజించండి’ అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు.

ఆ మూడురాష్ట్రాల్లో ఏం చేశారు?:

‘చంద్రబాబు మూకుమ్మడిగా తెచ్చిన మోడీ, వెంకయ్య, పవన్ కల్యా‌ణ్‌.. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. అందరిదీ ఒక్కటే టార్గెట్ జగన్. అందరూ మనస్ఫూర్తిగా జగ‌న్‌ను ఆడిపోసుకున్న తరువాత, ‘సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం.. హైదరాబాద్ లాంటి రాజధానిని మళ్లీ సీమాంధ్రలో కడతాం.. అదిగదిగో చందమామ..’ అని మోడీ సీమాంధ్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడూ ఇదే వాగ్దానాలు చేసింది. కనీసం ఒక్కో రాష్ట్రానికి రూ. 500 కోట్లయినా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కనీసం చెప్పుకోదగ్గ మంచి ఆస్పత్రి కూడా లేదు. అలాంటిది మోడీ నిన్న వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతామంటే నమ్మడానికి తెలుగు ప్రజలు అమాయకులనుకుంటున్నారా.. లేక పిచ్చివాళ్లనుకుంటున్నారా..? ఇంకొకరు వెంకయ్య‌నాయుడు ఈయన సొంత నియోజకవర్గంలో, సొంత వార్డుల్లో ఒక్క వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేరు' అని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

పవన్‌ జన సేవ చేస్తారట! :
'ఇంకొకరు ఆయన పక్కనే నిల్చున్నారు, పవన్ కల్యా‌ణ్‌ అట. ఈ పవన్ కల్యా‌ణ్ తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం అనే ఓ పార్టీ పెట్టారు. అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రూ. 70 కోట్లకు ఆ పార్టీని అమ్మేసుకుని మంచం కింద ఆ డబ్బు దాచి పెట్టుకుని కేసులు జరగకుండా మేనే‌జ్ చేసుకున్నారు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కల్యా‌ణ్ అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ప్రచారం చేశారు, హామీలు కూడా ఇచ్చారు. ప్రజారాజ్యంలో యువసేన అనే దానికి అధ్యక్షునిగా ఉన్నారు.‌ ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ‌అదే పార్టీకి తమ పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కల్యాణ్. ఈయన‌ జన సేవ చేస్తారట.. సేవ అనే పేరుతో కామన్ మ్యా‌న్ ప్రొటెక్ష‌న్ ఫో‌ర్సు అనే సంస్థ పెట్టి.. కోట్ల కొద్దీ విరాళాలు కూడా సేకరించారు. ఆ సంస్థ ఏమైందో, ఆ విరాళాలను ఏం చేశారో ఎప్పుడైనా చెప్పారా? ఎంత మంది ప్రజలకు సేవ చేశారో ఎప్పుడైనా చెప్పారా? అంత హడావుడిగా కోట్ల రూపాయలు సేకరించి స్థాపించిన సంస్థ కదా.. కనీసం ఇప్పుడది బతికి ఉందా, చచ్చిందా.. అదైనా చెప్పారా పవన్ కల్యాణ్‌... చెప్పలేదు. ఈ ఐదేళ్ళల్లో ఎవరికీ ఏ సమాధానమూ చెప్పలేదు. మొన్న ఆడిటోరియంలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజల కోసం ప్రశ్నించడానికే ముందుకు వచ్చానని చెప్పుకున్నాడు పవన్ కల్యాణ్‌' అని దుమ్మెత్తిపోశారు.

బాబుకు అధికారం ఇస్తే గోతిలో పడ్డట్లే :
'వీళ్లందరినీ తెచ్చింది చంద్రబాబు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను సీఎం అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. పదేళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ పదేళ్లలో నేను ప్రజలకు వచ్చిన ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఫలానా పోరాటం చేశాను.. ప్రభుత్వం మెడలు వంచి ఫలానాది సాధించాను.. ఓట్లు వేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంత అసమర్థుడు ఎన్నికలు వచ్చిన ఈ తరుణంలో అన్ని దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడు.. పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం గొరిగేసినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మొత్తం దోచేస్తాడు. చంద్రబాబు మాటల్లో నిజంలేదు. చంద్రబాబు వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గుండెల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే' అని శ్రీమతి షర్మిల హెచ్చరించారు.

Back to Top