రాష్ట్రం నష్టపోవడానికి కర్త.. కర్మ.. క్రియా బాబే

* రక్షించాల్సిన సీఎం భక్షిస్తున్నాడు
* కేంద్ర బడ్జెట్‌ను ఎందుకు స్వాగతించారో బాబు చెప్పాలి
* నారాకాసురుడిపై పోరాటం చేస్తే తప్ప హోదా సాధించలేం
* బాబును ఎందుకు ప్రశ్నించడం లేదో పవన్‌ క్లారిటీ ఇవ్వాలి
* హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామాలకైనా సిద్ధం
* వైయస్‌ఆర్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మరీ ఇంతలా నష్టపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కర్త, కర్మ, క్రియా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. రామాయణంలో రావణాసురుడిపై పోరాటం చేస్తే తప్ప ముగింపు లేదు... నరకాసుడిపై పోరాటం చేస్తే తప్ప దీపావళి రాలేదు... నారాకాసురుడిపై పోరాటం చేస్తే  తప్ప హోదా సాధించుకోలేమని ఆయన అభివర్ణించారు. బడ్జెట్‌లో కేంద్రం ఏపీకి ఎలాంటి ప్రయోజనాలకు కల్పించలేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉంటే చంద్రబాబు ఆయన భాగస్వామ్య పార్టీ (బీజేపీ) మాత్రం బాగుందంటూ రాష్ట్రంలో సంబరాలు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. మోసకారి  చంద్రబాబు ప్రభుత్వంపై అమర్‌నాథ్‌ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమిచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హోదా ప్రకటించినందుకా.. లేక రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినందుకా.. మీరు మూడు సంవత్సరాల్లో నిర్మాణం చేస్తామన్న పోలవరానికి 20 వేల కోట్లు మంజూరు చేసినందుకా.. లేక చట్టంలోని అంశాలను అమలు చేస్తామని చెప్పినందుకా దేని బడ్జెట్‌ బ్రహ్మాండగా ఉంది.. స్వాగతించామని చెబుతున్నారో స్పష్టం చేయాలని నిలదీశారు. నిజంగా కేంద్రం ఇవన్నీ ప్రకటించివుంటే వైయస్‌ఆర్‌సీపీ సంపూర్ణంగా బడ్జెట్‌ను స్వాగతించేదని చెప్పారు. 
ప్యాకేజీ సముద్రంలోని నీటిబొట్టుతో సమానం
భారత్, పాక్‌ మధ్య మ్యాచ్‌లో ఆఖరి బంతికి పాకిస్తాన్‌ గెలిస్తే  భారతీయుడు సంబరాలు చేసుకున్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను ముందుండి రక్షించాల్సిన వ్యక్తే భక్తిస్తున్నాడని మండిపడ్డారు. ఓటుకు కోట్ల కేసు ముందు హోదా కోసం నా రక్తం మరుగుతుందన్న చంద్రబాబు తరువాత ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటుకు కోట్ల కేసు తరువాత రాష్ట్రానికి ఏమాత్రం అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగానే రాష్ట్రం ముఖ్యమంత్రి అభివర్ణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకపోగా ఉన్నవాటిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర విభజన వద్దు అని 5 కోట్ల మంది ప్రజలు ఉద్యమాలు చేస్తే విభజనకు మద్దతు ఇస్తూ చంద్రబాబు లేఖ రాశారని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన తరువాత అదే ప్రజానికం హోదా కోరుకుంటుంటే దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారని ఫైరయ్యారు. చంద్రబాబు ఎందుకు ప్రత్యేక హోదా వద్దంటున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌ ఎడారిలో వేసిన విత్తనానికి, గోదావరి జిల్లాలో వేసే విత్తనానికి తేడా ఉంటుంది చంద్రబాబు అని చురకంటించారు. ప్యాకేజీలోని రాయితీలు సముద్రంలోని నీటి బొట్టుతో సమానం అని, కానీ హోదా సముద్రపు నీటితో సమానమని బాబుకు సూచించారు. 
పవన్‌.. బాబును ప్రశ్నించూ?
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పష్టత కావాలని గుడివాడ అమర్‌నాథ్‌ కోరారు. శరీరాలు వేరైనా అవిభక్త ఆత్మల్లా కలిసుండే వెంకయ్య, చంద్రబాబుల్లో వెంకయ్యను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. విశాఖపట్నం కొవ్వత్తుల ర్యాలీకి వచ్చిన ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అధికార యంత్రాంగం అప్రజాస్వామికంగా అడ్డుకుంటే మీరెండుకు చంద్రబాబును ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాజధాని ప్రాంత్రంలో బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కుంటుంటే మీరెండుకు చంద్రబాబును ప్రశ్నించడం లేదని పవన్‌ను అమర్‌ సూటిగా ప్రశ్నించారు.  చంద్రబాబును పవన్‌ ఎందుకు ప్రశ్నించడం లేదో క్లారిటీ ఇవ్వాలని కోరారు. నేను ట్వీట్లు అయినా చేస్తున్నాను.. ఎంపీలు పార్లమెంట్‌లో మాట కూడా మాట్లాడటలేదని ఏ ఎంపీలను దృష్టిలో పెట్టుకొని అన్నారు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రెండున్నర సంవత్సరాలుగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హోదా కోసం నిజాయితీగా పోరాటం చేస్తుందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు 35 ఉద్యమాలు చేశామని చెప్పారు. వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాటలకు కట్టుబడి ఉన్నారన్నారు. అవసరమైతే ప్రత్యేక హోదా సాధన కోసం జూన్‌లో వైయస్‌ జగన్‌ ఎంపీలతో రాజీనామాలు కూడా చేయిస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ సీపీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు.
Back to Top