చంద్రబాబు ఆర్థిక నేరస్తుడు

శ్రీకాకుళం అర్బన్‌ : అధికారమే పరమావధిగా ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు గుప్పించి.. అధికారం చేపట్టిన తర్వాత ఒక్క హామీ కూడా అమలుచేయని ఘరానా మోసగాడు చంద్రబాబు అని జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి దుయ్యబట్టారు. ఎన్నికల్లో 600 హమీలు గుప్పించి.. అందులో ఒక్కటి కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. తాత్కాలిక సచివాలయం అంటూ అమరావతిలో రూ. కోట్లు దుర్వినియోగం చేశారన్నారు. రూ.5,574 కోట్లు దుర్వినియోగం అయినటు కాగ్‌ నివేదికలో పేర్కొందని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడిపై 28 కేసులు ఉన్నా స్టేలు తెప్పించుకొని తప్పించుకు తిరుగుతున్నారన్నారు.

 ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరస్తుడు చంద్రబాబేనని ప్రజలు గ్రహించారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఒక్క ఇల్లు కట్టలేని ఆయన.. తెలంగాణలో మాత్రం విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారన్నారు. ఇది ఆంధ్రులకు అన్యాయం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో తన కుమారుడు లోకేష్‌ను నిలబెడితే ఎక్కడ ఓడిపోతాడనే భయంతో.. దొడ్డిదారిలో ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టారని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు యువతకు ఇంటికో ఉద్యోగం అంటూ నమ్మించారని, అధికారం చేపట్టిన మూడేళ్ల తర్వాత.. తన కొడుకుకే ఉద్యోగం కల్పించుకున్నారు తప్ప యువతకు ఒక్క ఉద్యోగం కల్పించలేకపోయారని ఎద్దేవా చేశారు.
Back to Top