రాహుల్‌ కోసం రాష్ట్రం ముక్కలు

గుంటూరు, 19 ఆగస్టు 2013 :

రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనుకుంటే 2004 - 2009 సంవత్సరాల మధ్యలోనే ఆ పని చేయాల్సిందని నెల్లూరు ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిన అవసరం లేదన్నారు. దేశ ప్రగతికి రాహుల్‌ కృషి చేసి ఉంటే.. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడి ఉంటే.. అభివృద్ధి చేసి ఉంటే ఈ దేశ ప్రజలందరూ సంతోషించే వారన్నారు. దేశాభివృద్ధికి కాకుండా రాష్ట్రాన్ని విభజించే దుర్మార్గమైన పనికి పూనుకున్నారని దుయ్యబట్టారు. 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అమలు చేసిన మంచి పథకాలు నచ్చడం వల్ల మాత్రమే 2009లో కూడా కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారన్న విషయం గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాస్వామ్య విరుద్ధమైన నిర్ణయాలు, చర్యల కారణంగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం ఇవ్వరని సర్వేలే చెబుతున్నాయన్నారు. ఇరు ప్రాంతాలకు సమ న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దంటూ శ్రీమతి విజయమ్మ గుంటూరులో సోమవారంనాడు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షా ప్రాంగణానికి అశేషంగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలను ఉద్దేశించి మేకపాటి మాట్లాడారు.

‌రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలు వస్తాయని గతంలోనే కాంగ్రెస్‌ అధిష్టానానికి తాయు చెప్పామని మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. కానీ మన రాష్ట్రాన్ని విడగొట్టాలని చిదంబరం, అహ్మద్‌ పటేల్‌ అప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డికి ప్రజల్లో పరపతి లేకుండా చేయాలన్నది కాంగ్రెస్‌ అధిష్టానం ఉద్దేశం అని ఆరోపించారు. డిసెంబర్‌ 9న చిదంబరం ప్రకటనతో తెలంగాణలో ఉత్సవాలు, సీమాంధ్రలో ఉద్యమాలు ఊపందుకున్నాయన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలకు భయపడి డిసెంబర్‌ 23న ఆ ప్రకటనను ఉపసంహరించుకుందన్నారు.

తెలుగు జాతిని విభజిస్తూ కాంగ్రెస్ ‌పార్టీ ఏకపక్షంగా నిర్ణయించడానికి వ్యతిరేకంగా సీమాంధ్రలోని పట్టణాలు, నగరాలు, మారుమూల పల్లెల్లోనూ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారని నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని ఎందుకు విభజించాల్సి వచ్చిందని ఆయన నిలదీశారు. దీనికి శాస్త్రీయ దృక్పథం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు ఢోకా ఉండదన్న నమ్మకం వచ్చేదాకా ఆగి ఇప్పుడు మళ్ళీ విభజన దుర్మార్గానికి పాల్పడిందని మేకపాటి దుయ్యబట్టారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. సీమాంధ్రలోనే కాకుండా, తెలంగాణలోనూ శ్రీ జగన్, వైయస్‌ రాజశేఖరరెడ్డిని అభిమానించే లక్షలాది మంది ఉన్నారని, అక్కడ కూడా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సంపాదించుకుంటుందని, విశాలాంధ్రకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, ఆయన హవాను అడ్డుకోవడానికే రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ముక్యలు చేసిందని ఆయన నిప్పులు చెరిగారు. దేశాన్ని పరిపాలించేవారు ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవాలన్నారు. తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం, ఐదు, పది పార్లమెంటు స్థానాలు తెలంగాణలో వస్తాయనే స్వార్థంతోనే కాంగ్రెస్ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు. తెలంగాణలో పదే కాదు పదిహేను లోక్‌సభా స్థానాలు వచ్చినా 2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కాంగ్రెస్‌కు లేదని మేకపాటి అభిప్రాయపడ్డారు.

టిడిపి, సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్‌ పార్టీలు ఏకమై మహాకూటమిగా ఏర్పడి పోటీ పడినా కాంగ్రెస్‌కు రాష్ట్రంలో 33 స్థానాలు ఇవ్వడానికి కేవలం మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మీద ప్రజలు ఏర్పరచుకున్న అభిమానమే కారణం అని మేకపాటి చెప్పారు. రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి గారు ఒంటి చేత్తో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా 33‌ మంది లోక్‌సభ సభ్యులను ఢిల్లీకి పంపించి అక్కడా యుపిఎ కూటమికి అధికారం దక్కేలా చేశారన్నారు. వైయస్ఆర్‌ చేసిన మాదిరి కార్యక్రమాలు మీరు కూడా చేసి ఉండవచ్చు కదా అన్నారు. కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు లేకుండా అందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ఆయన అందించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన కుంభకోణాలన్నింటికీ గుణపాఠం చెప్పడానికి దేశ ప్రజలందరూ వేచిచూస్తున్నారని మేకపాటి హెచ్చరించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌ను ఓడించేందుకు ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు కూడా కంకణబద్ధులై ఉన్నారని అన్నారు.

తెలుగు ప్రజలను విభజించడం ఎంత వరకూ న్యాయమో ఆలోచించాలని కాంగ్రెస్‌ పార్టీకి మేకపాటి సూచించారు. రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటి నుంచో చెబుతోందన్నారు. అందరికీ సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని విభజించే హక్కు కాంగ్రెస్‌కు లేదని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అప్పుడూ ఇప్పుడూ చెబుతోందని రాజమోహన్‌రెడ్డి తెలిపారు. తెలుగు ప్రజలను నానా కష్టాలు పెట్టడం తగదు కాక తగదని ఆయన అన్నారు. తెలుగు జాతిని సమైక్యంగా ఉంచండి.. తెలుగు జాతి మన్ననలు పొందండి.. లేకపోతు సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని క్షమించరని హెచ్చరించారు.

దాదాపు 50 లోక్‌సభా స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను విభజించాలంటూ ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపినా దాని జోలికి వెళ్ళకుండా ఆంధ్రప్రదేశ్‌ను, తెలుగుజాతిని విభజించడంలో ఔచిత్యం ఏమిటని మేకపాటి ప్రశ్నించారు. తెలంగాణలో రాజకీయ నిరుద్యోగులే ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ అంటే తనకు గౌరవం అని అయితే ముఖ్యమంత్రి పదవి లేదనో, మంత్రి పదవి లేదనో కేసీఆర్‌ ఆందోళలు లేపడం సరికాదన్నారు. కేసీఆర్‌ లాంటి వారి స్వార్థానికి అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం అని మేకపాటి ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగు వందల ఏళ్ళ క్రితం ఏర్పడిన హైదరాబాద్‌ నగరం 1956లో విశాలాంధ్ర ఏర్పడిన తరువాతనే ప్రపంచ ఖ్యాతి పొందిందని మేకపాటి రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆధునిక హైదరాబాద్‌ నగరంగా అభివృద్ధి చెందడంలో సీమాంధ్రులు చేసిన సేవ లేదా? అని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు, విద్య, వైద్య, సినిమా రంగాల్లో, హొటళ్ళ ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను ప్రపంచ ఖ్యాతి పొందేలా కృషి చేశారన్నారు. దేశ రాజధానిగా ఢిల్లీ కాకుండా వేరే నగరాన్ని ఊహించలేమన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని సీమాంధ్రులకు కాకుండా చేసి మీరెక్కడికో వెళ్ళి రాజధానిని నిర్మించుకోండని చెప్పడంలో ఔచిత్యం ఏముందని ఆయన నిలదీశారు.

తెలంగాణ ఏర్పాటుకు తాను మద్దతిస్తానని చంద్రబాబు చెప్పడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని మేకపాటి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టండి మేం మద్దతుగా నిలుస్తామని చంద్రబాబు చెప్పారన్నారు. మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత మాత్రమే కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. మహాకూటమితో కలిసి 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసిన టిఆర్ఎస్‌ కేవలం 10 చోట్ల మాత్రమే గెలిచిన వైనాన్ని మేకపాటి ప్రస్తావించారు. రాజశేఖరరెడ్డిగారు మరి కొద్ది మాసాలు జీవించి ఉంటే ఆ పది మంది టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరి ఉండేవారన్నారు.‌ అంతకు ముందు గొంగళి కప్పుకుని పడుకున్న కేసీఆర్ వైయస్ఆర్‌ మరణం తరువాత ఉద్యమం పేరుతో లేచి కూర్చున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని చీల్చమని చంద్రబాబు నాయుడు ఉత్తరం ఇచ్చారని, ఇప్పుడు తగుదునమ్మా అంటూ తన పార్టీ ఎంపిలు కొందరి చేత, ఎమ్మెల్యేలు కొందరి చేత రాజీనామాలు చేయించి నాటకాలాడుతున్నారని రాజమోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రమాదాన్ని ముందుగా గ్రహించే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు జూలై 25న రాజీనామాలు చేశారని తెలిపారు. ఆగస్టు 5న తాను లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. ఈ నెల 10వ తేదీన పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి, గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ తమ తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన వైనాన్ని మేకపాటి ప్రస్తావించారు.

కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రతినిధులు పేరుకే రాజీనామాలు చేస్తున్నారని మేకపాటి విమర్శించారు. సమైక్యాంధ్రను కాపాడలేని వారంతా ఇప్పటికైనా నిబద్ధతతో రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాజకీయంగా ఎవరెన్ని డ్రామాలు చేసినా సమైక్యాంధ్రను కాపాడుకోవల్సిన బాధ్యత సీమాంధ్రుల భుజస్కంధాలపైనే ఉందని మేకపాటి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగిన వారికి మాత్రమే రాజ్యాధికారం అప్పగించాల్సిన బాధ్యత విజ్ఞులైన ప్రజలదే అన్నారు. సమైక్యాంధ్రను కాపాడడానికి శ్రీమతి విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజలంతా మద్దతుగా ఉండాలని ఆయన విజ్ఞప్తిచేశారు.

తాజా వీడియోలు

Back to Top