ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలపై గోదావరి జిల్లా రైతులు గర్జించారు. నమ్మించి ఎక్కువ సీట్లను గెలిపించిన పాపానికి నిలువునా మోసం చేస్తున్నారన్న సంగతి రుజువైంది. పశ్చిమ గోదావరి జిల్లా లో పాలకొల్లు లో రైతు గర్జన పేరుతో సదస్సు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షతన జరిగిన సభలో పెద్ద ఎత్తున నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. మాజీమంత్రి వైఎస్సార్సీపీ పగో జిల్లా పరిశీలకుడు పిల్లి సుబాష్ చంద్రబోస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ఉభయ గోదావరి జిల్లాలకు నీటి ఎద్దడి వస్తుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఎందరో మేధావులు, రైతు సంఘాల నాయకులు స్పష్టంగా చెప్పినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం ముడుపులు దండుకోడానికి రూ.1,300 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకం చేపట్టారని విమర్శించారు. ఈ కారణంగానే ఇప్పుడు రెండో పంటకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విశ్లేషించారు. పట్టిసీమకు పెట్టిన డబ్బుని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వెచ్చించి ఉంటే రాష్ట్రంలోని రైతులందరికీ ప్రయోజనం కలిగేదన్నారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి ఉభయగోదావరి జిల్లాల్లో దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరు ఇవ్వకపోతే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని గునపాలతో రైతులే పడగొట్టే రోజు వస్తుందని సుభాష్‌చంద్రబోస్ హెచ్చరించారు.