మంత్రి శ్రీధర్‌బాబు అనుచరుల ఆగడాలు

- టెంట్లు కూల్చివేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు
- వై‌యస్‌ఆర్‌ సిపి కార్యకర్తలతో ఘర్షణ

మంథని (కరీంనగర్), ‌20 సెప్టెంబర్‌ 2012: రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధ‌ర్‌బాబు అనుచరగణం ఆగడాలు శృతిమించిపోతున్నాయి. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నేతలపై అధికార కాంగ్రె‌స్ పార్టీ అణిచివేత చర్యలకు దిగుతోంది. మంథని నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకం పనుల్లో జాప్యాన్ని నిరసిస్తూ వైయస్‌ఆర్‌ సిపి జిల్లా కన్వీనర్ పుట్ట మధు గురువారం ముత్తారం మండలం లక్కారం నుంచి మంథని వరకు 26 కిలోమీటర్ల పాదయాత్ర ‌నిర్వహించారు. ఆ పాదయాత్రకు జనం తరలిరాకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. వైయస్‌ఆర్‌ సిపి శ్రేణులతో ఉద్దేశపూర్వకంగా ఘర్షణకు దిగారు.

పుట్ట మధు పాదయాత్ర వచ్చే రహదారిలోని కేశన్‌పల్లి కూడలి వద్ద మండల స్థాయి కాంగ్రెస్ నేతలు ‌ధర్నాకు దిగారు. అయితే, పాదయాత్రకు ఆటంకం కలిగించ వద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు కేకే మహేందర్‌రెడ్డి, రాజ్‌ఠాకూర్ వారితో మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. మధు మరో మార్గంలో ముందుకు సాగించేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా రెచ్చిపోయిన కాంగ్రె‌స్ నేతలు వై‌యస్‌ఆర్‌ సిపి నాయకులపై దాడి చేశారు. 

కాగా, మధు పాదయాత్ర సందర్భంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు భోజనం కోసం ఏర్పాటు చేసుకున్న ‌కేంద్రంపైనా కాంగ్రెస్ నేతలు దాడిచేసి టెంట్లు కూల్చివేశారు. వంటకాలను చిందరవందర చేసి హంగామా సృష్టించారు. కాంగ్రెస్‌ నాయకుల ఆగడాలపై కేకే మహేందర్‌రెడ్డి స్పందిస్తూ, నియోజకవర్గంలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రజా వ్యతిరేకపాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆగడాలు మితిమీరిపోయాయని, అదుపులో ఉంచుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు.   
Back to Top