షర్మిల బస్సు యాత్రను విజయవంతం చేయండి

ఆళ్లగడ్డ :

శ్రీమతి షర్మిల చేస్తున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఆళ్ళగడ్డలోని తన నివాసంలో రుద్రవరం, చాగలమర్రి మండలాల కార్యకర్తలతో మంగళవారం ఆమె భేటి అయ్యారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని శోభా నాగిరెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపడానికి శ్రీమతి షర్మిల బస్సు యాత్ర ప్రారంభించారన్నారు.

ఆళ్లగడ్డ ప్రాంతానికి యాత్ర వచ్చినపుడు వైయస్‌ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పెద్ద‌ ఎత్తున హాజరు కావాలని కోరారు. వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో సమైక్యాంధ్రను కోరుకుంటోందన్నారు. ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల బాబును జనం ఎట్టిపరిస్థితిల్లోనూ నమ్మబోరన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైన కాంగ్రెస్, టిడిపి నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ నాయకులు ‌బి.వి. రామిరెడ్డి, నిజాముద్దిన్, రంగనాయకులు, యర్రం ప్రతాపరెడ్డి, సత్యనారయణ, రాంగుర్విరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆళ్లగడ్డలో 6న సమైక్య శంఖారావం బస్సు యాత్ర :
శ్రీమతి షర్మిల బస్సు యాత్ర ఈ నెల 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటుందని శోభా నాగిరెడ్డి తెలిపారు. ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలిలో ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళు‌లు అర్పిస్తారన్నారు. ఆళ్లగడ్డలో బహిరంగ సభ ఉండబోదన్నారు. రోడ్దు వెంట ప్రజలకు అభివాదం చేస్తూ శ్రీమతి షర్మిల ముందుకు సాగుతారన్నారు.

Back to Top