మహానేత వల్లే రాజకీయంగా ఎదిగా

హైదరాబాద్, 30 నవంబర్ 2012:

ప్రత్యేక తెలంగాణ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి చిత్తశుద్ధిలేదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని శుక్రవారం ఉదయం ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పలు కలిశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న అస్పష్ట విధానాలతో విసుగు చెంది ఆ పార్టీని వీడుతున్నామని వారు అన్నారు. తెలంగాణ విషయంలో శ్రీ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

     ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప చంచల్‌గూడ జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయంగా ఎదగడానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో కృషి చేశారని ఇంద్రకరణ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే చేరుతానని ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మాహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఆశయాలతో ముందుకు సాగుతామని కోనప్ప అన్నారు.

      అనంతరం లోటస్ పాండ్‌లో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మను వారు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమడలేకనే బయటకు వచ్చామన్నారు. మహానేత ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను తుంగలోతొక్కుతూ కేవలం తమ కుర్చీలను కాపాడుకోవడానికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు.

Back to Top