'మహానేత మృతితో సంక్షోభంలో వ్యవసాయం'

విజయనగరం : మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాల మరణం అనంతరం రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని వైయస్‌ఆర్‌సిపి రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కష్టాలు, నష్టాలు ఎదురైనప్పటికి అన్నదాతలు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని ఆయన పిలుపునిచ్చారు. విజయనగరంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు బాగుపడితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాల కారణంగా ఖరీఫ్, రబీ సీజన్‌లో పూర్తి స్థాయిలో పంటలు పండించలేని దుస్థితిలో అన్నదాతలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నదాతలకు వెన్ను దన్నుగా ఉండాల్సిన ప్రభుత్వమే వారి నడ్డి విరుస్తోందని నాగిరెడ్డి ఆరోపించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రైతుల ప్రయోజనాల కోసం అనేక సాగునీటి ప్రాజెక్టులు ఏర్పాటు చేసి 72 శాతం పనులు పూర్తి చేశారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరల్లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. వ్యవసాయరంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉండేవారని, మళ్లీ అలాంటి పరిస్థితులు రావాలంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి సీఎం కావాలని స్పష్టం చేశారు.

ప్రజా సమస్యలపై‌ పోరాడిన మహానేత వైయస్:
ప్రజా సమస్యలపై పోరాటం చేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. ‌విజయనగరంలోని కోట జంక్షన్ వద్ద నిర్వహించిన కోటి సంతకాల సేకరణ‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 'జగన్ కోసం‌.. జనం సంతకం' కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిస్తామని తెలిపారు. పార్టీ జిల్లా కన్వీనర్‌ పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ, జనవరి 1వరకు సంతకాల సేకరణ నిర్వహిస్తామన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సిపి గెలుపు ఖాయమన్నారు.
Back to Top