మేం అవిశ్వాసం పెడితే టిడిపి మద్దతిస్తుందా?

‌గణపవరం (గుంటూరు జిల్లా), 9 మార్చి 2013: ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే బలమే ఉంటే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చూస్తూ చేతులు ముడుచుకుని కూర్చోదని జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అన్నారు. ప్రభుత్వంపై ‌అసెంబ్లీలో టిడిపి అవిశ్వాసం పెడితే వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మద్దతిస్తుందని‌ ‌జననేత శ్రీమతి షర్మిల తెలిపారు. అలా తాను చేయని పక్షంలో వైయస్‌ఆర్‌సిపి అవిశ్వాసం పెడితే టిడిపి మద్దతిస్తుందా అని శ్రీమతి షర్మిల సూటిగా ప్రశ్నించారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరంలో శనివారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు తీరుపై శ్రీమతి షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. మీరు అవిశ్వాసం పెట్టండి... ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలుతుందని ఆమె వ్యాఖ్యానించారు.

'టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి రారట. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయరట. ప్ర‌జా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టరట. ఇదేమని అడిగితే వై‌యస్‌ఆర్‌సిపినే పెట్టమంటున్నారు. వైయస్‌ఆర్‌సిపికి ఆ శక్తి ఉండి ఉంటే బాబు లాగా కళ్లప్పగించి చూస్తూ ఊరుకోదు. తగినంత బలం లేకున్నా అందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వంపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే మీరు మద్దతిస్తారా చంద్రబాబూ?‌ అంటూ శ్రీమతి షర్మిల ప్రశ్నించారు. తమను పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ‌కు వద్దని జనమంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అయితే, ఈ సర్కారుకు చంద్రబాబు పూర్తి అండదండలందిస్తూ రాష్ట్ర ప్రజలను నిలువునా వంచిస్తున్నారు. అవిశ్వాసం పెట్టకుండా తప్పించుకునేందుకు సాకులు వెతుకుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసం పెడితే.. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారో తేలిపోతుందని శ్రీమతి షర్మిల అన్నారు.

ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులని చంద్రబాబు భావిస్తున్నారని అందుకే ఉచిత వాగ్దానాలిస్తున్నారని శ్రీమతి విమర్శించారు. సబ్సిడీలిస్తే ప్రజలు సోమరిపోతులవుతారని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. మహిళలకు మంగళ సూత్రాలిస్తానని 1999లో చెప్పిన బాబు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారని విమర్శించారు. ప్రజల బాగోగుల గురించి చంద్రబాబు ఆలోచించడంలేదని, ఎంతసేపూ తనకు అధికారం ఎలా దక్కుతుందా? అనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

ముగిసిన 86వ రోజు షర్మిల పాదయాత్ర :
కాగా, శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం 86వ రోజు‌ శనివారం పాదయాత్ర షెడ్యూల్ గణపవరంలో ముగిసింది. రాత్రికి ఆమె గణపవరంలో ఏర్పాటు చేసిన బస కేంద్రంలో విశ్రాంతి తీసుకుంటారు. శనివారం సాయంత్రం శ్రీమతి షర్మిల పాదయాత్ర ముగిసే సరికి మొత్తం 1,186.4 కిలోమీటర్లు నడిచారు.

పాదయాత్ర శనివారం గుంటూరు జిల్లా నాదెండ్ల మండల కేంద్రం శివారు నుంచి ప్రారంభమైంది. జాస్టివారి పాలెం, గణపవరం మీదుగా 9 కిలోమీటర్ల మేర సాగింది. గణపవరంలో శ్రీమతి షర్మిలకు బంతిపూల జల్లుతో స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిల రాత్రి గణపవరం శివారులో ఏర్పాటు చేసిన శిబిరంలో బస చేశారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ, తలశిల రఘురామ్, జంగా కృష్ణమూర్తి, మేరుగ నాగార్జున, డాక్ట‌ర్ హరికృష్ణ, పూనూరి గౌతం రెడ్డి, స్థానిక నాయకులు లేళ్ల అప్పిరెడ్డి, కావటి మనోహ‌ర్‌నాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవళ్ల రేవతి, బండారు సాయిబాబు మాదిగ తదితరులున్నారు.
Back to Top