పేదల ఇళ్లు తొలగిస్తే సహించం

నెల్లూరు: ప్రత్యామ్నయ స్థలాలు ఇవ్వకుండా పేదల ఇళ్లు తొలగిస్తే సహించేది లేదని, ప్రత్యక్ష పోరాటం చేపడుతామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలోని భక్తవత్సల నగర్, ఉమ్మారెడ్డి గుంట ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలు చెప్పుకున్నారు. గత 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, కూలీనాలీ చేసుకొని బతుకుతున్నామని తమ గోడు వెల్లబోసుకున్నారు. ప్రభుత్వమే తమకు  ఇళ్ల పట్టాలు ఇచ్చిందని, ఇప్పుడు అర్థాంతరంగా ప్రత్యామ్నయం చూపకుండా ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ..నెల్లూరు నగరంలో పేదల ఇళ్లు కూల్చివేస్తామని ప్రజలను భయపెట్టడం గత మూడేళ్లుగా ఈ ప్రభుత్వానికి అలవాటైందన్నారు. ఇలాంటి చర్యలు ప్రజలను మానసికంగా బాధించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో  ఇళ్ల తొలగింపునకు ఇష్టారాజ్యంగా మార్కింగ్‌ ఇచ్చారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 22వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ మొయిళ్ల సురేష్‌రెడ్డి, 21వ డివిజన్‌ ఇన్‌చార్జ్‌ చేజర్ల మహేష్, నాయకులు వెంగళ్‌రెడ్డి, రాజారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, భాస్కర్, అమీర్‌జాన్, కృష్ణ, రాజేశ్వరమ్మ, మునీంద్ర, మనోహర్, కార్తీక్, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top