ఎమ్మెల్యే కోటంరెడ్డి చొర‌వ‌తో పోస్టుమార్టం

నెల్లూరు: నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి  హెచ్చరికతో  స్ధానిక పెద్దాసుపత్రిలో మృత‌దేహానికి పోస్టుమార్టమ్‌ చేసిన సంఘటన చోటుచేసుకుంది. మైపాడుకి చెందిన అశోక్‌ అనే వ్యక్తి ప్రమాదంలో ఆదివారం మరణించాడు. అక్కడి పిహెచ్‌సీలో పోస్టుమార్టం చేసేందుకు వసతులు లేకపోవడంతో శవాన్ని సోమవారం నగరంలోని పెద్దాసుపత్రికి తరలించారు. అక్కడి అధికారులు తమ పరిధిలోది కాదని పోస్టుమార్టం జిల్లా వైద్యశాఖాధికారి పరిధిలో జరగాలని చెప్పారు. మరణించిన వ్యక్తి బంధువులు డిఎంహెచ్‌ఓను సంప్రదిస్తే ఆయన పెద్దాసుపత్రి అధికారులే పోస్టు మార్టం చేయాలంటూ తప్పించుకున్నారు. ఇలా ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ పోస్టుమార్టం చేయకపోవడంతో వారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీదర్‌రెడ్డి వద్దకు వచ్చి తమ బాధను వెళ్లబోసుకున్నారు. దీంతో కోటంరెడ్డి వెంటనే పెద్దాసుపత్రికి వచ్చి మెడికల్‌ కళాశాల  ప్రిన్సిపాల్‌ రవిప్రభుతో చర్చించారు. ఆయన కూడా డిఎంహెచ్‌ఓ పరిధిలో పోస్టుమార్టం చేయాలని తమకు సంబంధం లేదని చెప్పారు. వెంటనే డిఎంహెచ్‌ఓ డాక్టర్‌ వరసుందరంను పిలిపించారు. ఆయన వచ్చిన వెంటనే ఎమ్మెల్యే ఒక్కసారిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏం ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ ప్రాణాలను కోల్పోయిన అభాగ్యులను ఏడిపిస్తారా అంటూ నిలదీశారు. ఇదేనా మానవత్వం, మంచి తనం అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులను తీసుకుని  శవంతో పాటు  కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. దీంతో హుటాహుటిన అధికారులు శవానికి పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా వారంలోపు  తగిన ఉత్తర్వులు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి శాంతించారు.

Back to Top