కొర్రతండాలో వైయస్ విగ్రహావిష్కరణ

ఖమ్మం:

అంతిమదశలో ఉన్న కాంగ్రెస్‌కు మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర రెడ్డి ప్రాణం పోశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు. మండలంలోని కొర్రతండాలో డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ సువర్ణ పాలన అందించిన వైయస్‌ను పేదలంతా దేవుడిగా కొలుస్తున్నారనీ, వాడవాడలా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనమనీ ఆయన వివరించారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దివంగత నేత ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను నేటి పాలకులు నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా డాక్టర్ వైయస్ పరితపించారనీ, నేడు అన్నదాతలు నరకం అనుభవిస్తున్నారనీ  ఆవేదన వ్యక్తంచేశారు. మండలంలోని పుటాన్‌తండా, కుర్రాతండా తదితర గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. సుమారు 150 కుటుంబాలు పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్‌కుమార్ సమక్షంలో పార్టీలో చేరాయి.

Back to Top