సోనియా కనుసన్నల్లోనే కిరణ్ దొంగ దీక్ష

నక్కపల్లి (విశాఖపట్నం జిల్లా) :

కాంగ్రెస్ అధిష్టానం కనుసన్న ‌ఆదేశాలతోనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీలో దొంగదీక్ష చేశారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముందు అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎం కిరణ్‌ నిరాకరించారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తరువాత ఓటింగ్ ‌నిర్వహించాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని కొణతాల తూర్పారపట్టారు. తెలంగాణ బిల్లుపై కేవలం చర్చకు మాత్రమే అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. సమైక్యాంధ్ర వాదాన్ని వినిపించడానికి ప్రధాన అస్త్రాలైన ఈ రెండు డిమాండ్లను పక్కన పెట్టి టీ బిల్లులో లొసుగులు ఉన్నాయంటూ వెనక్కి పంపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

సీఎం కిరణ్,‌ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తెలుగు జాతి మొత్తాన్ని మోసం చేస్తున్నారని కొణతాల రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ఢిల్లీ ఆదేశాలను తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేసే ప్రతి పనీ సోనియా గాంధీ ఆదేశాల మేరకే చేస్తున్నారన్నారు. తెలంగాణ బిల్లును యధాతథంగా పార్లమెంట్‌లో ఆమోదిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సీఎం అనడం సిగ్గుచేటు అన్నారు. మరో 40 రోజుల్లో  ఎన్నికలు వచ్చి ఊడిపోయే పదవికి ఇప్పుడు రాజీనామా చేస్తాననడంలో ఔచిత్యం ఏమి ఉందన్నారు. సమైక్యాంధ్రపై సీఎం కిర‌ణ్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటన వెలువడిన మరుక్షణమే ఎందుకు పదవి నుంచి తప్పుకోలేదని కొణతాల ప్రశ్నించారు.

Back to Top