‌కొండెక్కిన ఎల్ఎల్‌సీ ఆధునికీకరణ: షర్మిల

కర్నూలు: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్ఎ‌ల్‌సీ) ఆధునికీకరణకు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రూ. 150 కోట్లు కేటాయించినా మూడేళ్లుగా పనులు పూర్తికాలేదని వైయస్‌ఆర్‌ సిపి అధినేత జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విమర్శించారు. పులికనుమ, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే‌ తీరులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగన్మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 30 రోజులుగా ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న షర్మిల శుక్రవారంనాడు పెద్దకడుబూరు మండలంలోని హెచ్‌. మొరవణి నుంచి తన యాత్రను ప్రారంభించి ఎమ్మిగనూరులోని ‌గణేష్ రైస్‌ మిల్లు వరకూ కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల‌ సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆమె పేర్కొన్నారు. సాగునీరు లేక అప్పుల్లో మునిగిపోయిన రైతులు తమను ఆదుకునే వాడే లేడని బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

జనం సమస్యలు శ్రద్ధగా వింటూ... భరోసా ఇస్తూ...
హెచ్. మొరవణి వద్ద ఏర్పాటు చేసిన రచ్చబండలో మహిళల సమస్య‌లను షర్మిల అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్థానికులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీనితో షర్మిల మాట్లాడుతూ, ‘అన్నా, తమ్ముడూ వెనక్కి వెళ్లండి. ఆడవాళ్లను ముందుకు పంపండి’ అని కోరుతూ సుమారు అరగంట సేపు వారితో మాట్లాడారు. కరెంటు లేకపోయినా బిల్లులు దండిగా వస్తున్నాయని, తాగడానికి నీళ్లు కూడా లేవని, ఇందిరమ్మ ఇళ్లు లేక, కట్టుకున్న ఇళ్లకు బిల్లులు రాకపోవడంతో తాము ఎన్నెన్నో కష్టాలు పడుతున్నామని, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని మహిళలు షర్మిల ముందు వాపోయారు.

మహిళలు చెప్పిన కష్టాల గురించి విన్న షర్మిల స్పందిస్తూ, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి పేదలంటే కోపమని, వైయస్ కుటుంబం మీ‌ద కోపంతో ప్రజలందరినీ హింసిస్తోందని దుయ్యబట్టారు. ‘ఒక్క సంవత్సరం పాటు ఎలాగోలా కష్టపడండమ్మా... తర్వాత మన ప్రభుత్వమే వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు అన్ని కష్టాలు తీరుతాయి. పింఛన్లు వస్తాయి. పిల్లలకు ఉచితంగా చదువులు చెప్పించుకోవచ్చు. రోజుకు 9 గంటల ఉచిత విద్యుత్ ‌వస్తుంది. వడ్డీ లేకుండానే రుణాలు వస్తాయి. దేవుడు కూడా కరుణించి వానలు కురిపిస్తాడు’ అని ధైర్యం చెప్పారు. కంబళహాల్ క్రా‌స్, జగ్గాపురం క్రా‌స్, కొత్త గొళ్లాల దొడ్డి గ్రామాల్లో‌నూ తనను కలవడానికి వచ్చిన మహిళలు, రైతులు, కూలీలతో షర్మిల మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పి ముందుకు సాగారు.
Back to Top