కోడెలకు శిక్ష తప్పదు

నరసరావుపేట: 2014 ఎన్నికల్లో సత్తెనపల్లిలో పోటీచేస్తూ రూ.11.50 కోట్లు ఖర్చు చేశానని  చెప్పిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు..24 గంటల్లోనే తాను అలా అనలేదని మాటమార్చడం దారుణమని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. బాధ్యతాయుతమైన స్పీకర్ పదవిలో ఉంటూ  అన్న మాటను అనలేదని చెప్పడం స్పీకర్ కు తగదన్నారు.  ఎన్నికల్లో  రూ.11.50 కోట్లు ఖర్చయిందని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పీకర్  కోడెల చెప్పిన విషయం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. దీనిపై ప్రజల నుంచి విమర్శలు తలెత్తటంతో స్పీకర్  మాట మారుస్తున్నారని దుయ్యబట్టారు. 

పదవిపై గౌరవం, చిత్తశుద్ధి ఉంటే చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూపై కోడెల కట్టుబడి ఉండాలన్నారు. సత్తెనపల్లిలో ఎన్నికల ఖర్చును పరిశీలిస్తే అంతకంటే ఎక్కువగానే ఖర్చుపెట్టి ఉంటాడనేది తేటతెల్లమవుతుందన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఇప్పుడు తప్పించుకున్నా ప్రజాకోర్టులో తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. కోడెల లాంటి వ్యక్తుల వల్లే రాజకీయ నాయకులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని గోపిరెడ్డి విమర్శించారు. 
Back to Top