కి'రణ

అందరి కళ్ళూ ఇప్పుడు సీఎం ఢిల్లీ బాటపైనే నిలిచాయి. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాజధానికి వెళ్ళిన కిరణ్ ఏ కబురు మోసుకొస్తారనే అంశం అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ధర్మాన ప్రసాదరావు రాజీనామా అంశం ఈ పర్యటనలో ఓ కొలిక్కి వస్తుందా.. లేక కిరణ్ కుమార్ అంకానికే తెర పడుతుందా అనేది రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేస్తోంది.

2010 డిసెంబరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి, వైయస్సార్¬ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్¬ విజయమ్మ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అపాయిట్¬మెంట్ కోరుతూ ఓ లేఖ రాశారు. అధినేత్రి అందుకు నెలరోజులపైనే సమయం తీసుకుని ఎట్టకేలకు అంగీకారం తెలిపారు. ఇదే అంశాన్ని ఇప్పడు అందరూ గుర్తుచేసుకుంటున్నారు. అందుకో కారణం ఉంది. గురువారం నాటి పరిణామాలను పరిశీలించిన వారికి దీనికి తేలిగ్గా సమాధానం లభిస్తుంది. గురువారం నాడు ఆమె అడిగిన వారికి లేదనకుండా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను కలుసుకోవడానికి అనుమతించేశారు. సీఎల్పీలో ప్రెస్ మీట్ నిర్వహించడానికి వీల్లేకుండా గదికి తాళం వేసి మరీ అవమానించిన మాజీ మంత్రి శంకరరావు నుంచి ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన చిరంజీవి వరకూ ఇదే అదనుగా ఆమెను కలిసి వచ్చారు. శంకరరావు ఓ అడుగు ముందుకేసి ప్రధాని కార్యాలయంలో కార్యదర్శిని కలిసి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి చేత ఎందుకు రాజీనామా చేయించరని అడిగేశారు. ధర్మాన రాజీనామాను ఆమోదించాలా లేదా తెలియక సతమతమవుతున్న పార్టీకీ మరో తలనొప్పి తెచ్చిపెట్టారాయన.

సోనియా గాంధీతో అరగంట సేపు చర్చించిన చిరంజీవి మీడియా వద్ద పెదవి విప్పకుండా నిష్క్రమించడం కొంత ఆసక్తిని రేకెత్తించింది. అతను(కిరణ్ కుమార్ రెడ్డి) బాగా పనిచేస్తున్నాడని అంతకు ముందు వ్యాఖ్యానించిన 'అందరివాడు" ఇప్పుడు నోరు మెదపకపోవడాన్ని ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు.

ధర్మాన రాజీనామా అంకాన్ని చూసి వేడెక్కిన కొందరు మంత్రులు ముఠా కట్టి మరీ సీఎం చెబితే సంతకం చేసిన తమ పరిస్థితేమిటని ఆవేదన వెలిబుచ్చారు. అర డజను మంత్రులు, సుమారుగా పన్నెండుమంది ఎమ్మెల్యేలు మంత్రి వట్టి వసంత కుమార్ ఇంట్లో సుదీర్ఘంగా సమావేశమై మరీ చర్చించుకున్నారు. తద్వారా తమను తాము రక్షించుకోవడానికి ఎందుకైనా సిద్ధమన్న సంకేతాలనూ అధిష్ఠానానికి పంపి ఉంటారన్నది విశ్లేషకుల అంచనా. సోనియాను కలిసే ముందు ముఖ్యమంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలవడం ఎందుకనే కోణంలోనూ వారు ఆలోచిస్తున్నారు. మేడమ్¬ను కలిసిన తర్వాత కిరణ్ చెప్పేదాన్ని బట్టి ఓ స్పష్టత వస్తుందనేది నిర్వివాదాంశం. తమిళనాడు గవర్నరుగా ఉన్న రోశయ్య ముఖ్యమంత్రిత్వానికి రాజీనామా చేసేముందు కూడా ఇలాగే సోనియాను కలిసి గుట్టు చప్పు కాకుండా హైదరాబాద్ వచ్చేశారు. కొంత కాలంపాటు రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని తిరిగి హఠాత్తుగా గవర్నరుకు సమర్పించేశారు. ఇప్పడూ అలాగే అవుతుందా.. లేక రాజకీయ కాక నిప్పు మీద నీళ్ళు చల్లినట్లు ఆరిపోతుందా అనేది వేచి చూడాల్సిందే.

Back to Top