కేసీఆర్‌గారూ.. స్పందించండి: రాఘవరెడ్డి

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైతుల పాలిట పిడుగుపాటులా మారిన అకాల వర్షాలతో నష్టపోయిన అన్నదాతలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వర్షాలతో నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమవారం స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆపార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డిలు మీడియాతో మాట్లాడారు.
 
తెలంగాణలోని 10 జిల్లాల్లోనూ అకాలవర్షాలతో రైతులు పూర్తిగా నష్టపోయారని, ప్రభుత్వం అండగా నిలబడాలని మరో అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, పంట నష్టాలను జీర్ణించుకోలేక ఐదుగురు రైతులు హఠాన్మరణం చెందారన్నారు. వీరిలో కొందరు పిడుగుపడి చనిపోతే.. మరికొందరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో క్యారెట్, నల్లగొండ లో వరి పంటలు పూర్తిగా నీటమునిగాయని తెలిపారు. ‘రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని కేసీఆరే చెప్పారు కనుక వారి కంట నీరు తుడవాల్సిన బాధ్యత ఆయనదేనన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.5 లక్షల పరిహారం ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ దివంగత వైఎస్ జీవో 421 ఇచ్చారని, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.3 లక్షలకు పెంచి ఇవ్వాలని అన్నారు. పిడుగుపాటుకు, కరెంటు తీగలు తగిలి మృతి చెందిన వారికి రూ.5 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు.  
Back to Top