కష్టాలివీ.. తీరే దారేదీ..!!

విజయవాడ 28 మార్చి 2013:

అద్దెకు ఉండేవారికి ఇళ్లు, స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీని పాలకులు గాలికొదిలేశారని రాజరాజేశ్వరిపేట వాసులు మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా బుధవారం రాజరాజేశ్వరీపేటలో దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో స్థానికులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.  తమ సమస్యలను వివరించారు. ఇళ్లు లేక నానా అగచాట్లు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తంచేశారు.  తాగుబోతుల ఆగడాలు పెచ్చుమీరాయనీ, మద్యం అమ్మకాలు నిలిపివేస్తేనే తమ జీవితాలు బాగుపడతాయనీ   మహిళలు గోడు వెళ్ళబోసుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు జరిగిన రచ్చబండలో పలువురు స్థానిక సమస్యలను ఏకరువు పెట్టారు. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ శ్రీమతి షర్మిల ఓదార్చారు.
ఆమెతో స్థానికుల సంభాషణ వివరాలు ఇలా ఉన్నాయి..

ప్రేమలత : పన్నెండేళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. సొంత ఇళ్ళున్నవారికే మళ్లీ ఇళ్ళిస్తున్నారు. మాకు  లేవంటున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు. అద్దె ఇళ్లలో నరకయాతన అనుభవిస్తున్నాం.

రత్నకుమారి : ఇంటి రుణం  రూ.30 వేలను ఒకేసారి కట్టాలని బ్యాంకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఇక్కడ అందరూ కాగితాలు ఏరుకుని జీవనంవెళ్ళబుచ్చేవాళ్ళం.  వంటపనులు చేసుకొనే వాళ్లేనమ్మా. ఒకేసారి అంత మొత్తం కట్టమంటే ఎలాగమ్మా. బ్యాంకోళ్లు ఇంటిముందుకొచ్చి ఆగం చేస్తున్నారు. ఇళ్లు రిపేర్లు కూడా చేయించుకోలేకపోతున్నాం.

వరలక్ష్మి : ఇక్కడ మూడు వైన్‌ దుకాణాలున్నాయి అక్కా. మగాళ్లు పనులకెళ్లి వచ్చిన సొమ్మంతా మందుకే తగలేస్తున్నారు. పిల్లల చదువులు సాగడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. పోలీసోళ్లు వైన్‌షాపుల యాజమానులనే మద్దతు పలుకుతున్నారు. మీరే మాకు న్యాయం చేయాలి.

సరస్వతి : పాయకాపురం పోలీసులు రాక్షసుల్లా మారారమ్మా. ప్రతిదానికి లంచం అడుగుతున్నారు. ఇళ్ల దగ్గర ఆడోళ్ల గొడవ జరిగితే ఒట్టి పుణ్యానికి మా అమ్మాయిని తీసుకెళ్లి రాత్రంతా ఉంచారు. మహిళలకు రక్షణ లేదమ్మా. జగన్ వస్తేనే మాకు న్యాయం జరిగిదే.

శ్రీదేవి : దుర్గా కో-ఆపరేటివ్ బ్యాంక్ వాళ్లు వడ్డీలతో జనం నడ్డి విరగ్గొడుతున్నారు. కాల్వగట్ల నుంచి వచ్చాం. వారి  తీరుచూస్తుంటే మళ్లీ మమ్మల్ని కాల్వగట్టకు పంపేట్టున్నారమ్మా. ఓట్లేస్తే ఇళ్లిస్తామన్నారు. ఇంతవరకూ అతీగతీ లేదు. రెండు నెలలకోసారి రేషన్ ఇస్తున్నారు. అదేమంటే విసుక్కుంటున్నారు.

శేషు : మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి అంద రికీ ఆరోగ్యశ్రీ ఇస్తే. ఇప్పుడు కుంటిసాకులతో డాక్టర్లు కొర్రి వేస్తున్నారు. వెన్నుపూసకు గతంలో ఆరోగ్యశ్రీలో చికిత్స చేసేవాళ్లు. ఇప్పుడు చేయమని వెనక్కిపంపుతున్నారు అక్కా.

జగనన్న ముఖ్యమంత్రయితేనే మీ బాధలు తీరుతాయి : షర్మిల
వారి బాధలు విన్న తర్వాత శ్రీమతి షర్మిల మాట్లాడుతూ జగనన్న సీఎం అరుుతేనే మీ సమస్యలు తీరుతాయని చెప్పారు. కొంచెం ఓపిక పట్టండి, కుట్రలు, కుతంత్రాలు మనల్ని ఏమీ చేయలేవు. జగనన్న రాజన్నరాజ్యం తీసుకొస్తాడని హామీ ఇచ్చారు. జగనన్న సీఎం అయ్యాక ప్రభుత్వమే ఇళ్లకు మరమ్మతులు చేరుుస్తుందని చెప్పారు. ఇళ్లు లేని వారికి నిర్మించి ఇస్తామని తెలిపారు.
బ్యాంకు అధికారుల వేధింపులపై వైయస్ఆర్ కాంగ్రెస్ నేతలు పోరాటాలు చేస్తారని పేర్కొన్నారు. ఎవరూ అధైర్యపడొద్దు త్వరలోనే అరాచకాలకు పాల్పడే మద్యం సిండికేట్లను అణిచివేస్తామని, మహిళల కోసం ప్రత్యేకంగా పోలీసులను ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

Back to Top