ఇడుపులపాయ (వైయస్‌ఆర్ జిల్లా), 17 అక్టోబర్ 2012: కాంగ్రెస్ పార్టీ ప్రజా కంటక మారిపోయిందని, తెలుగుదేశం పార్టీ ప్రజాద్రోహిగా వ్యవహరిస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మహానేత వైయస్ కుమార్తె షర్మిల పాదయాత్ర చేస్తున్నారని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. ఇడుపులపాయలో మంగళవారం ఆయన వైయస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం వైయస్‌ఆర్ జిల్లా అధ్యక్షుడు వైయస్ అవినాష్‌రెడ్డి, పాదయాత్ర సమన్వయ కమిటీ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే గౌరవ సలహాదారు పి.మోహన్‌రెడ్డి, ఏపీ ఆగ్రోస్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతరం ‘మరో ప్రజాప్రస్థానం’ ఫ్లెక్సీని భూమన కరుణాకర్‌రెడ్డి ఆవిష్కరించి స్వయంగా స్తంభానికి కట్టారు. తర్వాత విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై చేస్తున్న పాదయాత్ర నీరస యాత్రలా మారిందని ఎద్దేవా చేశారు. షర్మిల పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టిస్తుందన్నారు. తండ్రి బాటలో మరోమారు ప్రజా అవసరాలను గుర్తించేందుకు షర్మిల వైయస్‌ఆర్ ఘాట్ నుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేల కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రను ప్రారంభిస్తారని చెప్పారు. షర్మిల యాత్ర దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.