స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

నెల్లూరు: జిల్లాలో పరిశ్రమలు స్థాపించేవారు స్థానికులకే అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హరనాథపురంలోని నారాయణ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో నిర్వహించిన జాబ్‌మేళా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు రైతుల వద్ద నుంచి వేలాది ఎకరాల భూమి తీసుకుంటున్నారన్నారు. అయితే ఇందులో స్థానికులకు కాకుండా వేరే వారికి ఉపాధి కల్పించడం దుర్మార్గమన్నారు. వేలాది ఉద్యోగాలు కల్పిస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి నామమాత్రంగానే అవకాశాలు కల్పించడం సరైంది కాదన్నారు. 

స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, ఇందుకు ప్రత్యామ్నయంగా ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మోసం చేశారన్నారు. హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని, ఇందుకోసం వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
 
Back to Top