జగన్‌‌ను ఎంతకాలం జైల్లో ఉంచుతారు: విజయమ్మ

రావికంపాడు, 17 మే 2013:

పశ్చిమ గోదావరి జిల్లా చింతలూరు నియోజకవర్గం రావికంపాడులో గురువారం రాత్రి  ఏర్పాటైన  బహిరంగ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సీబీఐ వైఖరిపై నిప్పులు చెరిగారు. విచారణ తీరును నిలదీశారు. విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..

‘జగన్‌బాబును జైల్లో పెట్టి ఏడాది అవుతోంది. ఇంకా సరిపోలేదా? ఇంకెంత కాలం జైల్లోనే ఉంచుతారు? సీబీఐ ఒక్కొక్కరిని ఒక్కో రకంగా విచారిస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం పాటిస్తోంది. ప్రధాన మంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైయస్ఆర్‌‌కు ఒక న్యాయమా?’ రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత బోఫోర్సు కేసు నుంచి ఆయన పేరును తొలగించారు. కానీ రాష్ట్రంలో మాత్రం దివంగత మహానేత మరణించాక వైయస్ఆర్ పేరును ఎఫ్‌ఐర్‌లో చేర్చారు.

మోపిదేవి, ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలు... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలన రెండోభాగం సాగుతోంది. ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో... ఈరోజు కిరణ్ పాలనలో అలాంటి కష్టాలే పడుతున్నారు. కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులను జైల్లో పెట్టించారు, బ్రిటీష్ వారి కాలంలో మాదిరిగా రైతుల గోళ్లు పీకించిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ రోజుల్లో రైతులు, పేదలకు కూలి పని కూడా లేదు. అందువల్లే అనేక మంది ఇతర రాష్ట్రాలకు, గల్ఫు  దేశాలకు వలస పోయారు. చంద్రబాబు పాలనలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.  54 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారు.

నాటి వైయస్ఆర్ ప్రజా ప్రస్థానం పాదయాత్రను గుర్తుచేసుకుంటూ.. ‘ఇంత ఎండలున్నాయి.. కొంచెం ఎండలు తగ్గాక పాదయాత్ర చేస్తే బాగుంటుందేమో’నని వైయస్‌కు చెప్పా. అప్పుడాయన నాకు ఒకే మాట చెప్పారు.. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నారు.. చంద్రబాబు పాలన చీకటి పాలన. రైతులు, పేదలు, మహిళలు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోజు ప్రజా ప్రస్థానానికి బయలుదేరారు. సీఎం అయ్యాక అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు.

నేడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మరో ప్రజాప్రస్థానం పేరుతో మళ్లీ ప్రజల్లోకి వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని శ్రీ జగన్మోహన్‌ రెడ్డి భావించారు. అక్టోబర్ 5న బెయిల్ వస్తే పాదయాత్ర చేయాలని తానే రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారు. సీబీఐ చేత ఆయనను అరెస్టు చేయించడంతో రాలేకపోయారు. మరో ప్రజాప్రస్థానం.. ప్రజలకు ధైర్యం చెప్పడానికి వచ్చిన యాత్ర అని, భరోసా ఇచ్చే యాత్ర. జన నేతగా మీ అందరి మధ్యలో ఉన్న జగన్‌బాబును  కక్షతో జైలుకు పంపి ఏడాదవుతోంది. వీటన్నిటికి వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో మీ ముందుకొచ్చింది. ఈ సమస్యలను అధిగమించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజన్న సువర్ణయుగాన్ని తెచ్చుకోగలిగినప్పుడే అసలైన పండగ.

నేడు అధికార , ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయి. ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ర్టంలో ఇంకో పార్టీ, ఇంకో పేపర్ ఉండకూడదని నిర్ణయించుకున్నాయి. ఈ రెండు పార్టీలకు నీతి లేదు. నిజాయితీ అంతకంటే లేదు. వీసమంత విశ్వసనీయత కూడా లేదు. ఈ రెండు పార్టీలు వెన్నుపోటు పార్టీలుగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కంటే చరిత్రహీనుడు మరొకరు లేరు.

Back to Top