రాగులపాడు (అనంతపురం జిల్లా) 4 నవంబర్ 2012 : జగనన్న జైలు నుండి బయటకు వచ్చి రాజన్న రాజ్యం మళ్లీ స్థాపిస్తాడనీ, అది కుట్రలు చేసిన కాంగ్రెస్, టిడిపిలకు చెంపపెట్టు అవుతుందనీ షర్మిల వ్యాఖ్యానించారు. 18 వ రోజు పాదయాత్రలో భాగంగా ఆమె అనంతపురం జిల్లా రాగులపాడు బహిరంగసభలో ప్రసంగించారు. వైయస్ఆర్ బ్రతికి ఉంటే ఆయనను కూడా జైలులో పెట్టేవారని ఆమె అన్నారు. అంత పెద్దాయన పేరునే ఎఫ్ఐఆర్‌లో ఇరికించినవారు జగన్‌ను మాత్రం వదులుతారా? అని ఆమె ప్రశ్నించారు. వాళ్ల వయసులో సగం కూడా లేని చిన్నవాడైన జగన్‌ను పాపం ఒంటరిని చేసి, బెయిలు కూడా రాకుండా కష్టపెడుతున్నారని ఆమె కాంగ్రెస్, టిడిపి నాయకులను ఉద్దేశించి విమర్శించారు. అయితే ఉదయించే సూర్యుడిని ఎలాగైతే ఆపలేరో, జగనన్నను కూడా అలాగే ఎవ్వరూ ఆపజాలరని షర్మిల వ్యాఖ్యానించారు. దేవుడే జగనన్నను బయటకు తీసుకువస్తాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సమయం వచ్చినప్పుడు కుట్రలు చేసిన కాంగ్రెస్, టిడిపిలకు బుద్ధి చెప్పాలని ఆమె ప్రజలను కోరారు. సభలో కొండా సురేఖ తదితర నేతలు పాల్గొన్నారు. సభకు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు.