జగనన్నను తరలించే కుట్ర

జయంతి (కృష్ణా జిల్లా), 17 ఏప్రిల్‌ 2013: జగనన్నను మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి తరలించాలని కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కొత్త కుట్ర చేస్తున్నారని శ్రీమతి షర్మిల ఆరోపించారు. వీళ్ళ తెలివితేటలు చూసి ఆశ్చర్యపోవాలో, అసహ్యించుకోవాలో అర్థం కావడం లేదన్నారు. మహానేత వైయస్‌ కుటుంబాన్ని వెలివేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఆవేద వ్యక్తంచేశారు. మరో ప్రజాప్రస్థానం 123వ రోజు బుధవారంనాడు శ్రీమతి షర్మిల కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలోని జయంతిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు చూస్తే అమ్మకు అన్నం పెట్టనివాడు చిన్నమ్మకు బంగారు గాజుల చేయిస్తానన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. జగనన్నకు జనంలో వస్తున్నా ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  ఎన్నికల ముందు ఇచ్చే మాటను తరువాత మరిచిపోయే చంద్రబాబును విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు.

జగనన్నను జైలులో ఎందుకు పెట్టారని నిలదీస్తే.. ఈ రోజు వరకూ ప్రభుత్వం నుంచి చట్టబద్ధమైన సమాధానం లేదని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు. సిబిఐ సమాధానం చూస్తే.. తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్న చందంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న మీద చేసిన ఆరోపణలు ఆ 26 జిఓలకు సంబంధించినవి. ఆ జిఓలతో సంబంధం లేని జగనన్న మాత్రం ఈ రోజు జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

సాక్షులను ప్రభావితం చేయగలిగితే అధికారంలో ఉన్న మంత్రులు చేయాలి గాని కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చేసి అ‌ధికార, ప్రధాన ప్రతిపక్షంతో ఏకకాలంలో పోరాడుతున్న జగనన్న ప్రభావితం చేయలేదు.. చేయలేడన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారని ఆయనను ఇన్నాళ్ళుగా జైలులో నిర్బంధించారని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న జైలులో ఉంటే ఆ జిఓలతో ప్రమేయం ఉన్న మంత్రుల దర్జాగా బయటే తిరుగుతున్నారని, అధికారాన్ని అనుభవిస్తున్నారని అన్నారు. ఈ కేసు మొదలైనప్పుడే ఎవరిని జైలులో పెట్టాలి, ఎవరిని బయట ఉంచాలని ముందే డిసైడ్‌ చేసినట్లు ఉందన్నారు.

జగనన్న జైలులో ఉన్నది ఏదో నేరం చేసి కాదన్నారు. కేవలం రిమాండ్‌లో ఉన్నారని, శిక్ష పడి కాదని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. జగనన్నను జైలులో పెట్టి ఇప్పటికి పది నెలలు దాటినా నిర్బంధాన్ని ఇలాగే కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ ప్రకారం 90 రోజులు దాటిన తరువాత నిర్బంధంలో ఏ ఒక్కరినీ ఉంచడానికి వీలు లేదన్నారు. కానీ చట్టంతో సంబంధం లేకుండా జగనన్న నిర్బంధం కొనసాగుతూనే పోతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధానం వ్యక్తి ప్రాథమిక హక్కులను కాలరాయడమే అన్నారు. విచారణ పేరుతో ఎంతకాలం జగనన్నను జైలులో ఉంచుతారని శ్రీమతి షర్మిల నిలదీశారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సి విషయం ఇది అని ఆమె పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే అధికారం సిబిఐకి ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఒక పార్టీ అధ్యక్షుడిని ఇంకా ఎంతకాలం నిర్బంధంలో ఉంచుతారని నిలదీశారు. కాంగ్రెస్‌ చేతిలో కీలుబొమ్మగా మారిని సిబిఐ తీరును ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి పౌరుడికీ ఉందన్నారు.

జగనన్నకు జైలులో సౌకర్యాలు అందుతున్నాయంటూ కాంగ్రెస్‌ టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని శ్రీమతి షర్మిల ఖండించారు. జగనన్నను వేరే రాష్ట్రానికి తరలించాలన్న కొత్త డిమాండ్‌ను కాంగ్రెస్‌ నాయకులు తెరపైకి తేవడాన్ని ఆమె తప్పుపట్టారు. కాంగ్రెస్‌ చెప్పుచేతల్లో ఉండే జైలు అధికారులు జగనన్నకు ఏ విధంగా సౌకర్యాలు సమకూరుస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన అన్నా వదినల పెళ్ళి రోజున జైలు అధికారులు వ్యవహరించిన తీరును శ్రీమతి షర్మిల ప్రస్తావించారు. కాంగ్రెస్‌, టిడిపి కుమ్మక్కై జగనన్నను జైలులో పెట్టిస్తే అధికారులు ఆయనకు సౌకర్యాలు కల్పిస్తున్నారంటే విడ్డూరం కాక మరేమిటన్నారు.

కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలు జగనన్న నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు వస్తుంటే ఆ పార్టీల నాయకులు కుప్పిగంతులు వేస్తున్నారని శ్రీమతి షర్మిల దుయ్యబట్టారు. మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి పేరును ప్రజల హృదయాల్లోంచి చెరిపేయడానికి కాంగ్రెస్‌, టిడిపి నాయకులు కుట్రలు పన్నారన్నారు. ఆయన పథకాలకు సమాధి కట్టి ఆయనను ప్రజలు మరిచిపోయేలా చేయాలని కుట్రలు చేశారన్నారు. ప్రజల మనస్సులో రాజశేఖరరెడ్డిగారిని, జగనన్నను దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌, టిడిపి నాయకుల చెంపను దేవుడు పగలగొడతాడని శ్రీమతి షర్మిల హెచ్చరించారు. వీరి పాపం పండే రోజు దగ్గరలోనే ఉందన్నారు. జగనన్నను ఆపడం ఎవరి తరమూ కాదన్న ధీమాను శ్రీమతి షర్మిల వ్యక్తంచేశారు. జగనన్న బయటికి వచ్చి ప్రజలందర్నీ రాజన్న రాజ్యం వైపు నడిపిస్తారని హామీ ఇచ్చారు. రాజన్న రాజ్యంలో రైతే రాజవుతాడన్నారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలు, రైతులకు వడ్డీ లేని రుణాలిస్తారని భరోసా ఇచ్చారు. విద్యార్థులు, అన్ని వర్గాల వారికి మేళ్ళు చేస్తారన్నారు. గ్రామాల్లో బెల్టు షాపులు తీసేసి జీవితాలు బాగుచేస్తారని చెప్పారు.

అప్పటి వరకూ జగనన్నను ఆశీర్వదించాలని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని బలపరచాలని శ్రీమతి షర్మిల పిలుపునిచ్చారు.
Back to Top