జగనన్నను కలిసేందుకు జైలుకు వెళ్లిన షర్మిల

హైదరాబాద్:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో చంచల్ గుడా జైలుకు చేరుకున్నారు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకునే ముందు అన్నను చూడాలని ఆమె సోమవారం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న శ్రీమతి షర్మిల శుక్రవారం నాడు బీఎన్ రెడ్డి నగర్ వద్ద తూలిపడిన సందర్భంలో గాయపడ్డారు. అనంతరం ప్రాథమిక చికిత్స తీసుకుని నాలుగు కిలోమీటర్లు నడిచారు. ఆ రాత్రి కాలి నొప్పి తీవ్రతరం కావడంతో షర్మిలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి, శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు. తొలుత మంగళవారం ఉదయం శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు భావించారు. తాను జగనన్నను చూసిన తర్వాతే ఆపరేషన్ చేయించుకుంటానని శ్రీమతి షర్మిల పట్టుబట్టడంతో  మధ్యాహ్నం మూడు గంటలకు చికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె మంగళవారం ఉదయం భర్త బ్రదర్ అనిల్ కుమార్ నడిపిన కారులో చంచల్‌గుడా జైలు వద్దకు చేరుకున్నారు. వీల్ ఛైర్‌లో ఆమె జైలు గేటు వరకూ వెళ్ళి అతి కష్టంమీద నడుస్తూ లోపలికి ప్రవేశించారు.  ఆమె వెంట పార్టీ నేతలున్నారు.

Back to Top