ఆమరణ దీక్షకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం

హైదరాబాద్ 24 ఆగస్టు 2013:

అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేకూర్చాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. చంచల్‌గుడా జైలులో ఆదివారం ఆయన తన దీక్ష ప్రారంభిస్తారు. తొలుత గుంటూరులో తన తల్లి శ్రీమతి విజయమ్మ చేసిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరులో ఉన్న తల్లికి ఆయన జైలు అధికారుల అనుమతితో ఫోను చేసి ఆమెను దీక్ష విరమించమని కోరుతూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. తదుపరి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం శ్రీమతి వైయస్ షర్మిల బస్సు యాత్ర చేపట్టాలని కూడా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు కొణతాల రామకృష్ణ, భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ జైలుకు వెళ్ళి శ్రీ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అనంతరం శనివారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరాలు తెలిపారు.. విలేకరుల సమావేశం కొణతాల మాటల్లో...

రావణ కాష్టంలా రాష్ట్రం
గత నాలుగేళ్ళుగా రాష్ట్రంలో పరిస్థితి రావణ కాష్టంలా మారింది. పరిపాలన కుంటుపడింది. ప్రజలను పట్టించుకునే నాధుడే లేకపోయాడు. కేవలం రాజకీయ కారణాలతోనే, రాజకీయ లబ్ధి పొందడానికి ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర భవిష్యత్తుతో కాంగ్రెస్, టీడీపీలు ఆడుకుంటున్నాయి. యూపీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేశాయి. ఆంధ్ర రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తన విధానాన్ని తెలియజేసింది. తన విధానాన్ని తెలియజేయడానికే ఆ పార్టీ తొమ్మిది సంవత్సరాల సమయం పట్టింది. సమస్యల పరిష్కారానికి బదులు మరిన్ని సమస్యలు సృష్టించేలా వారి నిర్ణయం పరిణమించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమన్యాయం చేసేలా పరిష్కారం చూపడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. ఈ కారణంగా కిందటి నెల 28న వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు. ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ రాష్ట్రం ఎదుర్కోబోతున్న సమస్యలేమిటనేది ఆ లేఖలో స్పష్టంగా వివరించారు. జలవివాదాలు, సాగునీటి సమస్యలు, రెవెన్యూ, తదితర సమస్యలను పరిష్కరించకుండా తీసుకునే నిర్ణయం ఆత్మహత్యాసదృశమవుతుంది. ఈ రాష్ట్ర ప్రజలతో ఆడుకోవద్దని స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలు ఇచ్చారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నాననే అహంకారంతో ఏకపక్షంగానూ, ఎవరి అభిప్రాయాలూ తెలుసుకోవాలనే అవసరం లేదనే రీతిలో కరాఖండిగా వ్యవహరించింది. రాష్ట్రాన్ని విభజిస్తున్నామనీ, హైదరాబాద్ నగరాన్ని పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుతామనీ పేర్కొంటూ సీడబ్ల్యూసీ తీర్మానించినట్లు కాంగ్రెస్ తెలిపింది. కృష్ణా జలాల వివాదం, పోలవరం ప్రాజెక్టు, తదితరాలను ప్రస్తావించలేదు. ఈ ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ మా పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కూడా ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు సమర్పించారు. అనంతరం గుంటూరులో శ్రీమతి విజయమ్మ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టడం కూడా మీకు తెలుసు. ఇంత జరుగుతున్నప్పటకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా అనిపించలేదు. స్పందించకపోగా శ్రీమతి విజయమ్మ నిరాహార దీక్షను భగ్నం చేసి, తన అధికార దురహంకారాన్ని ప్రదర్శించింది.

రెండు ప్రాంతాలూ ఎడారులవుతాయి
ఈ నేపథ్యంలో తాను, భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్ చంచల్‌గుడా జైలుకు వెళ్ళి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిని కలిశాం. ఇలాంటి పరిస్థితుల వల్ల ఉభయ ప్రాంతాలు నష్టపోతాయని, సమస్యలను పరిష్కరించకుండా ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ రెండు ప్రాంతాలూ ఎడారులై.. జలయుద్ధాలు వచ్చే పరిస్థితి ఎదురవుతుందనీ, ఆర్థిక పరిస్థితి కూడా చిన్నాభిన్నమవుతుందనీ శ్రీ జగన్ ఆవేదన వ్యక్తంచేశారు. రెండు ప్రాంతాలకూ సమన్యాయం చేసేలా ఏకాభిప్రాయంతో ఓ తండ్రిలా వ్యవహరించాలనీ, అందరి ఆమోదంతో ఓ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టంగా కోరాం. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నాం. తొలుత కాంగ్రెస్ తన విధానాన్ని ప్రకటించాలనీ, తదుపరి దీనిపై యూపీఏ ప్రభుత్వం ఓ డ్రాఫ్టు తయారుచేసి, చర్చ పెడితే పార్టీలు తమ అభిప్రాయాలు తెలియజేసే అవకాశముంటుందన్నాం. తన అభిప్రాయం చెప్పకుండానే కాంగ్రెస్ ఏకపక్షంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసింది. వారి విధానాన్ని తెలియపరచడానికి కూడా అంగీకరించలేదు. స్టేక్ హోల్డర్సు అందరితో చర్చించి, ఏకాభిప్రాయానికి వచ్చి నిర్ణయం తీసుకోవాలని 28 డిసెంబరు 2012న ఏర్పాటు చేసిన సమావేశంలో కోరాం. ఈ మేరకు పార్టీ తరఫున లేఖ కూడా ఇచ్చాం.

ట్రిబ్యునల్ ఆదేశాలూ పట్టడం లేదు

కృష్ణా జలాలపై ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న వివాదంలో ట్రిబ్యునల్ ఆదేశాలను  కూడా ఆయా రాష్ట్రాలు పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు కూడా ట్రిబ్యునల్ ఆదేశాలను ధిక్కరించినప్పటికీ వాటిపై ఎటువంటి చట్టపరమైన చర్యలను చేపట్టలేకపోతున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములనుంచి మిగులు జలాలే మనకి వస్తున్నాయి.. దీనివల్ల కింది ప్రాంతాలు తీవ్ర ఇక్కట్లు పడుతన్నాయి. మహబూబ్ నగర్, కర్నూలు, కడప, చిత్తూరు ఇలా ఇబ్బందులు పడుతున్నాయి. రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులుంటే.. మరో రాష్ట్రం వచ్చి ఈ జలాల పంపిణీలో వివాదం అంటే ఎంతో దుర్భరమవుతుంది. మరిన్ని సమస్యలెదురై ఆ ప్రాంతాలన్నీ ఎడారులవుతాయి. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఒరిస్సా నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో నీరున్నప్పటికీ వినియోగించుకోలేక వృధాగా సముద్రంలోకి విడిచిపెట్టాల్సి వస్తోంది. పోలవరం వల్ల ఒరిస్సాకు ఎటువంటి ఇబ్బందీ లేకపోయినప్పటికీ, వారికి అన్ని రకాలుగా నష్టపరిహారాలు చెల్లిస్తామని చెప్పినప్పటికీ ఆ ప్రభుత్వం సహకరించడం లేదు. సుప్రీం కోర్టు ప్రాజెక్టుకు అంగీకరించినప్పటికీ సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి నిలుపుదల ఆదేశాలు ఇప్పించారు. ఒరిస్సా ఒత్తిడికి వంగి కాంగ్రెస్ ఇటువంటి నిర్ణయం తీసుకుందని భావించాల్సి వస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాష్ట్రం విడిపోయాక రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహకు అందడం లేదు. ఆదాయ వనరులు యాబై శాతం పైగానే హైదరాబాద్, పరిసరాలలోనే ఉన్నాయి. ఈ వనరులను మేం పంచుకుంటాం అంటే అంగీకరించే అంశం కాదు. భవిష్యత్తులో మా క్కూడా ఇవ్వండి అని తీసుకెళ్లే పరిస్థితీ లేదు. అన్నీ ప్రాంతాలకు ఆదాయ వనరులు, ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం కేంద్రం పైనే ఉంది. ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నవారున్నారు. ఇలాంటి ఎన్నో అంశాలను పరిష్కరించాల్సి ఉంది.

ఆవేదన, సమన్యాయం కోసం జగన్ దీక్ష
జలవనరుల వివాదం పరిష్కారం కాకుండా విభజన జరిగితే రెండు ప్రాంతాలు ఎడారులవుతాయనే ఆవేదన జగన్మోహన్ రెడ్డిగారిలో ఉంది. మహానేత ముఖ్యమంత్రిగా ఉండగా.. అభివృద్ధిలో మేటిగా నిలిచిన రాష్ట్రం ప్రస్తుతం అధోగతి పాలైంది. రాజకీయ దురాలోచనతోనే ఈ నాలుగేళ్ళలో తెలంగాణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరో అంశం శ్రీ జగన్మోహన్ రెడ్డిగారి అంశం. శ్రీ జగన్మోహన్ రెడ్డిగారిపై కక్ష సాధించాలీ, ఏరకంగా అణగదొక్కాలీ అని ఆలోచించి రాష్ట్ర విభజనే దీనికి ఔషధమని కేంద్రం దుర్మార్గమైన ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇది క్షుద్ర రాజకీయం. దీన్ని ఖండించాల్సి ఉందని భావించిన శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు జైలు అధికారుల అనుమతితో తన తల్లి శ్రీమతి విజయమ్మగారితో మాట్లాడారు. శ్రీమతి విజయమ్మను దీక్ష విరమించమని కోరి, రేపటినుంచి తానే దీక్షను చేపడతానని చెప్పారు. ఆదివారం నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డిగారు చంచల్ గుడా జైలులో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటారు. తదుపరి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఆలోచనతో శ్రీమతి షర్మిలమ్మ బస్సు యాత్ర చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం. ప్రజలందరి మేలుకోసం చేపడుతున్న ఈ కార్యక్రమాలకు ప్రజలంతా మద్దతు తెలపాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top