కాంగ్రెస్, టీడీపీలది విభజన రాజకీయం: జగన్

పత్తికొండ(చిత్తూరు జిల్లా), డిసెంబర్ 27:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీలపై తన విమర్శల పరంపరను ఉద్ధృతం చేశారు. సమైక్య శంఖారావం పర్యటనను శ్రీ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పునః ప్రారంభించారు. మధ్యాహ్నం పలమనేరు నియోజకవర్గం పత్తికొండలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకత్వాలను ఆయన తూర్పారపట్టారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..
'కాంగ్రెస్, టీడీపీ నాయకత్వాలు ప్రమాదకరమైన విభజన రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఓట్లు, సీట్లు పొందాలనే ఏకైక లక్ష్యంతోనే వారీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. విభజన కారణంగా ప్రజలు ఎదుర్కొనే కష్టాలు వారికి పట్టడం లేదు. మనమంతా సమైక్యంగా ఉండాలి. రాష్ట్రాన్ని విభజించేందుకు సోనియా గాంధీ ప్రతిపాదనను, అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కార్యాచరణను, చంద్రబాబు సోనియాకు వంత పాడుతున్న విధానాన్ని మనమంతా తిరస్కరించాలి. చంద్రబాబు ఈ విషయంలో ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారు.. 

చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి ఈ ప్రాంతానికి వచ్చినప్పడు.. విభజన జరిగితే కోస్తా ప్రాంత రైతుకు సాగు నీరెక్కడినుంచి వస్తుందని నిలదీయండి. హైదరాబాద్ ను విడదీస్తే మన యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించండి.
తెలుగు ఆత్మ గౌరవానికీ, ఢిల్లీ దురంహకారానికీ మధ్య సాగుతున్న యుద్ధమిది. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లను గెలిచి, ఈ విశ్వాస ఘాతకులైన కాంగ్రెస్, టీడీపీ నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలి. అప్పుడు రాష్ట్రాన్ని ఎవరు విభజిస్తారో చూద్దాం.
రాష్ట్రపతిని కలిసిన చంద్రబాబు ఆయనతో కనీసం సమైక్యాంధ్ర గురించి మాట్లాడడం కానీ, అందుకు మద్దతుగా లేఖ ఇవ్వడం కానీ చేయలేదు. సమైక్యాంధ్ర అనే మాటను కూడా ఆయన ఉచ్చరించలేదు. మూర్ఖత్వంతో తాను నమ్మిన ద్వంద్వ విధానాన్ని చంద్రబాబు పాటిస్తున్నారు.
చిత్తూరు నేల పైనే పుట్టిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం సమైక్య నాటకాన్ని రక్తి కట్టించడంలో తానేమీ వెనకబడలేదు. సమైక్య ముసుగులో ఆయన రాష్ట్ర విభజనకు పూర్తిస్థాయిలో కాంగ్రెస్ అధిష్టానానికి సహకరిస్తున్నాడు. ఎన్నికలు అతి తక్కువ సమయంలో ఉండడం, లక్ష్యం పెద్దది కావడంతో రాష్ర్ట విభజనలో ఢిల్లీకి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. రాష్ట్రం విడిపోతే, నీరు అందక సీమాంధ్ర ప్రాంతం పూర్తిగా ఎండిపోయి ఎడారవుతుంది. కాంగ్రెస్ నాయకులు ఆ విషయాన్ని విస్మరిస్తున్నారు. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేశారు. కేవలం కొన్ని ఓట్లు, సీట్లు కోసం చూస్తున్నారు. వీరి ఈ వైఖరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాల్సిందే. స్వల్ప ప్రయోజనాల కోసం కుట్రలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీల మాదిరిగా కాకుండా మనం విలువతో కూడిన రాజకీయాల కోసం నిలబడదాం. నలబై ఐదు లక్షల జనాభా ఉన్న చిత్తూరు జిల్లా సమైక్యాంధ్ర నినాదంతో మార్మోగిపోతోంది.
ఈ నేలపై పుట్టిన కిరణ్, చంద్రబాబులకు  ప్రజల అభిప్రాయాలను గమనించలేకపోతున్నారు. సమైక్యాంధ్ర కోసం నిలబడిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టండి. రాష్ట్ర శ్రేయస్సు చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిలకు పట్టడం లేదు.'
రాష్ట్రం సమైక్యంగా ఉండాలా విడిపోవాలా అనే అనే ప్రశ్నకు కలిసే ఉండాలని సభకు హాజరైన ప్రజలు ఎలుగెత్తి చెప్పారు. నియోజకవర్గంలోని రెండు ప్రాంతాలలో దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాలను శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.

Back to Top