బాబుపై తిరుగుబాటు సమయం ఆసన్నమైంది


  • చంద్రబాబు చేసిన కిరాతక చర్యలకు లెక్కేలేదు


  • రంగా హత్యలో చంద్రబాబు పాత్రపై లోకం కోడై కూస్తోంది


  • కిర్లంపూడిలో ముద్రగడతో భూమన భేటీ


  • కాపు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు


తూర్పుగోదావరి(కిర్లంపూడి)) : చంద్రబాబు హామీల ద్వారా మోసపోయిన ప్రతి ఒక్కరూ తిరుగుబాటు చేసే సమయం ఆసన్నమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మోసపు హామీల ద్వారా అధికారంలోకి వచ్చి ఇంతమంది ప్రజలను మోసం, వంచన, దగా చేస్తుంటే, దగాపడ్డ ప్రతి ఒక్కరూ చంద్రబాబు ప్రభుత్వం మీద దండయాత్ర చేస్తే, వాళ్లందరికీ, వాళ్ల పోరాటానికి వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కలిసి ఆయన ఉద్యమానికి మద్దతు తెలిపిన అనంతరం భూమన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో 600కు పైగా అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ మాటలు నమ్మి నష్టపోయిన రైతులు, డ్వాక్రా మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, మహిళలు దగా పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబు మోసాలతో నష్టపోయిన ఎవరైనా సరే ఉద్యమాలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే వారికి పూర్తి వెన్నుదన్నుగా నిలబడతానని చెప్పారు. అందుకు ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధమన్నారు. ఈ సంవత్సరం జనవరి 19న పద్మనాభం నిర్వహించిన సభకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేను ఆయన్ను కలిస్తే తనను ద్రోహిగా, సంఘవిద్రోహిగా, అరాచక శక్తిగా చంద్రబాబు సృష్టించడానికి విశ్వప్రయత్నం చేశారన్నారు. ఆధారాలు లేకుండా భయపెట్టాలని చూస్తే తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తుని ఘటనలో నా ప్రమేయముందని సాక్ష్యాలుంటే అరెస్ట్‌ చేయమనండి అని భూమన కరుణాకర్‌ రెడ్డి సవాల్‌ విసిరారు.

హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించను
చంద్రబాబులా తాను హింసాయుత రాజకీయాలను ప్రోత్సహించనని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు చేసిన కిరాతక చర్యలకు లెక్కేలేదని, అందుకు పరాకాష్ట.. రంగా హత్యలో చంద్రబాబు పాత్ర ఉందని లోకం కోడై కూస్తోందని చెప్పారు. మామ ఎన్టీ రామారావు మీద చెప్పులు విసిరిన ఘనత బాబుదని భూమన విమర్శించారు. పరిటాల, వైయస్‌ఆర్‌ కుటుంబానికి ఎలాంటి రాజకీయ గొడవలు లేవని భూమన వెల్లడించారు. పరిటాలపై జూబ్లీహిల్స్‌లో కారుబాంబు దాడి జరిగినప్పుడు దివంగత మహానేత వైయస్‌ఆర్‌తో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి కూడా పరామర్శించారని భూమన గుర్తుచేశారు. అలాగే రాజారెడ్డి చనిపోయినప్పుడు పరిటాల రవి నివాళులర్పించారన్నారు. ఎన్‌టీఆర్‌ హయాంలో పరిటాల రవిని అణగదొక్కాలని బాబు కుట్రపన్నారని భూమన ఆరోపించారు.

 ముద్రగడది వీరోచిత పోరాటం
చంద్రబాబు కాపులను బీసీలలో చేరుస్తామని హామీ ఇచ్చి, వాళ్ల చేత ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా పోతే.. ముద్రగడ పద్మనాభం వీరోచిత పోరాటానికి తెరతీశారని భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ముద్రగడ తీవ్రవాది కాదని, హింసా రాజకీయాలను ప్రోత్సహించే వ్యక్తి అసలే కాదని స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభాన్ని మనస్ఫూర్తిగా అభినందించడానికే తాను వచ్చానని, ఆయన నిబద్ధత కలిగిన వ్యక్తి అని అన్నారు. కాపులకు జరిగిన అన్యాయాన్ని చూసి భరించలేక.. ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ముద్రగడ లక్ష్యం పట్ల నమ్మకం కలిగిన వ్యక్తిగా అప్పుడు, ఇప్పుడు తాను చెప్పేది ఒకటేనని, కాపులు చేస్తున్న ఈ పోరాటానికి తమ పరిపూర్ణ మద్దతు కొనసాగుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎవరినైనా కలవొచ్చు కాబట్టే తాను ముద్రగడ పోరాటానికి మరోసారి మద్దతు పలకడానికి వచ్చానని స్పష్టం చేశారు. తనమీద అకారణంగా, అన్యాయంగా కేసులు పెట్టి, జైళ్లలో వేసే ప్రయత్నం చేస్తే కచ్చితంగా ముద్రగడ పద్మనాభంతో పాటు ఒక కార్యకర్తగా మారి తాను సైతం ఉద్యమంలో భాగస్వామి అవుతానని చెప్పారు.  వాళ్లందరినీ ఒక్కటిగా చేసే ప్రయత్నం చేస్తానని భూమన అన్నారు. 
 Back to Top