నీతిమంతులైతే స్టేలు ఎందుకు బాబూ

అవినీతిలో ట్రైనింగ్‌ స్కూల్‌ పెట్టుకునే అనుభవం తండ్రీకొడుకులది
వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదు
ఏ ఒక్క రంగాన్ని కూడా విడిచిపెట్టకుండా మోసం
నాలుగేళ్లలో ఒక్క మంచి పనైనా చేశారా?
సర్వేలన్నీ బాబు అవినీతి పరుడుంటున్నాయి
ఆధారాలున్నా.. బీజేపీ నేతలు ఎందుకు కేసులు పెట్టడం లేదు
చంద్రబాబు పాపం పండే రోజులు దగ్గరపడ్డాయి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాదరావు

హైదరాబాద్‌: చంద్రబాబు లోకేష్‌ నీతిమంతులైతే కోర్టులకు వెళ్లి ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాదరావు ప్రశ్నించారు. తండ్రీకొడుకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా అనిపిస్తుందన్నారు. నాలుగేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాలుగున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆధారాలతో సహా వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిందన్నారు. చంద్రబాబు, లోకేష్‌ నాయుడు వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వైయస్‌ జగన్‌పై బురదజల్లాలను కోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో వరప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్‌తో చేతులు కలిసి చంద్రబాబు తప్పుడు కేసులు పెట్టించారని, ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే వైయస్‌ జగన్‌ ఇప్పటికీ ధైర్యంగా విచారణలు ఎదుర్కొంటున్నారన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్నాడు కాబట్టే ఒక్క విచారణ కూడా ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకుంటున్నాడన్నారు. 
కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారిపై బురదజల్లాలని, అవినీతిని కొనసాగించాలని తప్పితే.. మంచి పాలన చేద్దాం.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డిలా పరిపాలన చేసిన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే రోజూ చంద్రబాబు ఆలోచించిన పాపాన పోలేదన్నారు. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం చంద్రబాబేనని భారతీయ ఎన్నికల సంఘం ప్రకటించిందన్నారు. రెండు ఎకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించి 30 ఏళ్లలో అతి ధనవంతుడిగా ఎలా ఎదిగారని ప్రశ్నించారు. ఎదుటి వారిపై నిందలు వేసే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. అదే విధంగా ఎన్‌సీఏఈఆర్‌ అని కామన్‌వెల్త్‌ ఆఫీస్‌ సర్వే చేస్తే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే ఏపీ అవినీతిలో నంబర్‌లో ఉందని తేల్చిందన్నారు. అంతేకాకుండా మరొక సీఎంఎస్‌ ఇండియా కరప్షన్‌ స్టడీ సర్వేలో ఏపీ అవినీతిలో రెండోస్థానంలో ఉందని చెప్పిందన్నారు. ఇంకో ఇంటర్నేషనల్‌ సంస్త ఆన్‌లైన్‌ సర్వే చేస్తే గత నాలుగేళ్లుగా ఏపీలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని వెల్లడించిందన్నారు. ఇలా అన్ని జాతీయ, అంతర్జాతీయ సర్వేలు చంద్రబాబు అవినీతి పరుడని చెబుతుంటే ప్రజల నుంచి తప్పించుకునేందుకు వైయస్‌ జగన్‌పై బుదరజల్లుతున్నారన్నారు. 

కాంగ్రెస్, టీడీపీ కుట్రలతో వేసిన కేసులను వైయస్‌ జగన్‌ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని, ఏ ఒక్క కోర్టు అయినా వైయస్‌ జగన్‌ దోషి అని తేల్చాయా అని చంద్రబాబును ప్రశ్నించారు. కోర్టులే కుట్రపూరిత కేసులు ఒక్కొక్కటిగా కొట్టివేస్తుంటే మీరెలా వైయస్‌ జగన్‌పై ఆరోపణలు చేస్తారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్‌ నీతిమంతులైతే.. ఎందుకు విచారణ ఎదుర్కోవడం లేదని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, నందమూరి లక్ష్మీపార్వతి, ఏబీకే ప్రసాద్‌ ఇలా అందరూ చంద్రబాబు ఆస్తులపై విచారణ జరిపించండి అని కోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. చంద్రబాబు, లోకేష్‌ నీతిపరుడైతే విచారణకు సిద్ధపడకుండా స్టే తెచ్చుకున్నారంటే అవినీతికి పాల్పడినట్లేనని అర్థం అవుతుందన్నారు. నాలుగేళ్లలో ఏ ఒక్క రంగాన్ని చంద్రబాబు విడిచిపెట్టలేదని, రాజధాని భూములు, ఇసుక, మట్టి ఇలా రాష్ట్ర వనరులను దోచుకున్నారన్నారు. టీడీపీ నేతలు పేదలకు అప్పులిచ్చి వారు కట్టలేకపోతే వ్యభిచార కూపంలోకి దించి, తరువాత వారితో బ్లూ ఫిలింస్‌ తీసిన నీచులని ధ్వజమెత్తారు. 

విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడిన పోలవరంను కమీషన్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు కేంద్రం నుంచి తీసుకున్నారని వరప్రసాద్‌ ఆరోపించారు. 2014లో రూ. 16 వేల కోట్లు ఉన్న అంచనాలను రూ. 58 వేల కోట్లకు పెంచి విపరీతమైన అవినీతికి పాల్పడ్డారన్నారు. నాలుగేళ్లుగా కేంద్రం నుంచి విడుదల డబ్బులను వెనకేసుకొని ఎలాంటి పనులు చేయకుండా తిరిగి కేంద్రానికి అప్పగిస్తున్నారన్నారు. పట్టిసీమ రూ. 4 వందల కోట్లతో పూర్తయ్యేదని కాగ్‌ చెప్పిందని, కానీ చంద్రబాబు రూ. 16 వందల కోట్ల ఖర్చు చేశారన్నారు. చంద్రబాబు ఆఖరికి పుష్కరాలను కూడా విడిచిపెట్టలేదని గోదావరి పుష్కరాలకు రూ. 2 వేల కోట్లు, కృష్ణా పుష్కరాలకు 18 వందల కోట్లు కేటాయించి అడ్డగోలుగా దోచుకున్నారన్నారు. ఇప్పుడు తాజాగా అన్నా క్యాంటీన్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 

చంద్రబాబుపై నిప్పులు చెరిగే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు కేసులు పెట్టడం లేదని వరప్రసాదరావు ప్రశ్నించారు. అంటే ఏమైనా లోపాయకార ఒప్పందాలు కుదుర్చుకున్నారా అని నిలదీశారు. చంద్రబాబు అవినీతిపై ఆధారాలున్నా.. ఎందుకు వెనకడగు వేస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు, లోకేష్‌ తండ్రికొడుకులిద్దరూ విపరీతమైన అవినీతికి పాల్పడుతూ.. డబ్బులపై మమకారం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు. దొంగలే మేం దొంగలం కామని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడం, లోపాయకార ఒప్పందాలు, చౌకబారు రాజకీయాలు చంద్రబాబుకు తప్ప ఎవరికీ రావన్నారు. ప్యాకేజీ కోసం హోదాను తాకట్టుపెట్టి రైట్‌ టర్న్‌ అనుకున్న చంద్రబాబు.. మళ్లీ ఎందుకు హోదా అంటూ యూటర్న్‌ తీసుకున్నారని ప్రశ్నించారు. విభజన చట్టంలోని అంశాలను సాధించలేని అసమర్థుడు, అబద్ధాల పుట్ట చంద్రబాబు అన్నారు. అవినీతిలో ట్రైనింగ్‌ స్కూల్‌ పెట్టేంత అనుభవం చంద్రబాబు, లోకేష్‌కు ఉందన్నారు. అలాంటి వ్యక్తులు వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు ఏదో ఒక రోజు విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. చంద్రబాబు పాపం పండే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top