డెల్టాను ఆధునికీకరిస్తే ముంపు తప్పేది

ఏలూరు :

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉంటే గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు పూర్తయ్యేవని, అలా జరగనందువల్లే లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగి అన్నదాతలు నష్టాల పాలయ్యారని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ‌పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. భారీ వర్షాలు, వరదల వల్ల పశ్చిమ‌ గోదావరి జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సోమవారం ఆమె పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం తణుకులో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త చీర్ల రాధయ్య కార్యాలయంలో శ్రీమతి విజయమ్మ విలేకరులతో మాట్లాడారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని డ్రెయిన్ల ప్రక్షాళనకు డాక్టర్‌ వైయస్ఆర్ రూ. 416 కో‌ట్లు కేటాయించారని శ్రీమతి విజయమ్మ గుర్తు చేశారు. వైయస్ఆర్ మరణానంతరం డెల్టా ఆధు‌నికీకరణను ఈ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదని విమర్శించారు. డెల్టా ఆధునికీకరణ జరిగి ఉంటే ముప్పు తప్పేదని శ్రీమతి విజయమ్మ అభిప్రాయపడ్డారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇ‌న్‌పుట్ సబ్సిడీ‌ని పెంచి ఇవ్వాలని, రంగు మారిన ధాన్యాన్ని.. పత్తి, మొక్కజొన్న ఇతర పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. ఈ దిశగా ప్రభుత్వంపై వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుందన్నారు. అన్నివిధాలుగా నష్టపోయిన రైతుల రుణాలను రీ‌ షెడ్యూల్ చేసి ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

‌భారీ వర్షాలు, వరదల కారణంగా పూర్తిగా కూలిపోయిన, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలని శ్రీమతి విజయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పునరావాస కేంద్రాల్లో కూడా సరైన రక్షణ చర్యలను ప్రభుత్వం తీసుకోలేకపోయిందని, విద్యు‌త్ షా‌క్‌తో శిబిరంలో ఒకరు చనిపోయారని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు వలలు, బియ్యం ఇచ్చి ఆదుకోవాలన్నారు.

వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ అన్నదాతలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, త్వరలోనే జగన్‌బాబు సీఎం అవుతారని, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతారని శ్రీమతి విజయమ్మ చెప్పారు. కౌలు రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వ్యవసాయ రంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర వ్యవసాయ శాఖకు వివరించి రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.

అన్నదాతలకు ధైర్యం చెప్పిన విజయమ్మ :
శ్రీమతి విజయమ్మ ఉంగుటూరు మండలం నారాయణపురంలో నీళ్లలో నడిచి వెళ్లి మునిగిన పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. నాచుగుంట వద్ద పొలాలను చూసి రైతుల గోడు విన్నారు. డెల్టా ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న నందమూరు అక్విడెక్టును పరిశీలించి అక్కడి రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. తణుకు నియోజకవర్గంలోని దువ్వ, ఇరగవరం మండలం గోటేరు, కంతేరు, ఆచంట నియోజకవర్గంలోని మినిమించిలిపాడు, ఆచంట, వేమవరంలో పూర్తిగా మునిగిన పొలాలను పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు. అనంతరం సిద్ధాంతం బ్రిడ్జి మీదుగా తూర్పు గోదావరి జిల్లాలో అడుగుపెట్టారు.

 వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ జిల్లా కన్వీన‌ర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేష్, తానేటి వనిత, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, వ్యవసాయ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు‌ ఎంవీఎస్ నాగిరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి తదితరులు‌ శ్రీమతి విజయమ్మ వెంట ఉన్నారు.

వరద మృతుల కుటుంబాలకు పరామర్శ :
అంతకు ముందు సోమవారం ఉదయం శ్రీమతి విజయమ్మ కృష్ణా జిల్లాలో వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించారు. విజయవాడలోని పునరావాస కేంద్రంలో విద్యుత్ షా‌క్‌తో మృతిచెందిన పందేటి రాము (21) మృతదేహాన్ని సందర్శించారు. అక్కడే ఉన్న ఆయన తల్లిదండ్రులు రవి, కనకదుర్గను ఓదార్చి, సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గన్నవరం మండలం ముస్తాబాద వెళ్లారు. పెద్దచెరువులో వరదనీటి ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన షేక్ మస్తాన్, ఆయన కుమార్తె పర్వీ‌న్ కుటుంబాన్ని పరామర్శించారు. ముస్తాబాదలోని ప్రమాదస్థలి వద్దకు వెళ్లిన శ్రీమతి విజయమ్మ మస్తాన్ భార్య నగీనా, తల్లి సిరాజున్నీసా, కుమారుడు మజీ‌ద్ సహా వారి బంధువులను ఓదార్చారు. శ్రీమతి విజయమ్మ వెంట పార్టీ నాయకులు తలశిల రఘురాం, సామినేని ఉదయభాను, వంగవీటి రాధాకృష్ణ, గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, కొడాలి నాని తదితరులున్నారు.

Back to Top