అనంతపురం, 30 అక్టోబర్ 2012: రాష్ట్ర ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం కనీసం తాగడానికి గుక్కెడు నీరు కూడా సరఫరా చేయకుండా చేతులు ఎత్తేసిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్నివిధాలా విఫలమైందని విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను పట్టించుకోవడంలేదని, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడంలేదని, ఫిజు రీయింబర్సుమెంట్‌కు కత్తెరలు వేస్తోందని షర్మిల దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్షం టిడిపి దానితో కుమ్మక్కై పట్టనట్టు కూర్చుందని షర్మిల విమర్శించారు. ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర అనంతపురం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోని పిల్లిగుండ్ల కాలనీ, నీనం రాజశేఖర్‌రెడ్డి నగర్‌కు చేరుకుంది.
చేనేత కార్మికుల పరిస్థితి రెండేళ్ళుగా చాలా దయనీయంగా ఉందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వారి పరిస్థితిని గమనించని దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 50 ఏళ్ళకే పింఛన్ అందే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. పట్టుచీరలకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నామని, పావలా వడ్డీ రుణాలు తమకు అందడంలేదని చేనేత కార్మికులు షర్మిల ముందు వాపోయారు. 103 డిగ్రీల జ్వరంతో బాధ పడుతూ కూడా చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జగన్ దీక్ష చేశారని పేర్కొన్నారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేనేత కార్మికులకు జగనన్న వడ్డీలేని రుణాలు అందజేస్తారని ఆమె హామీ ఇచ్చారు.